శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (12:58 IST)

కార్మికులకు కేసీఆర్ అభయ హస్తం : ఆర్టీసీ చార్జీల బాదుడు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభయహస్తం ఇచ్చారు. తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు అనుమతి ఇచ్చారు. అలా కార్మికులకు తీపి కబురు చెప్పిన కేసీఆర్... మరోవైపు, ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఫలితంగా ప్రయాణికులపై భారం పడనుంది. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చెంపుతామని, పెంచిన చార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. 
 
దీంతో ఆర్టీసీ బస్సులైన ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల సర్వీసుల చార్జీలు కిలోమీటరుకు 20 పైసల చొప్పున, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకు ఫేర్‌ స్టేజీ ఆధారంగా చార్జీలు పెంచేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో బస్సు చార్జీలు పెంచారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడే మళ్లీ చార్జీలు పెరగబోతున్నాయి. అప్పట్లో కిలోమీటరుకు 8 పైసల చొప్పున చార్జీలు పెంచగా... ఇప్పుడు కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెరగనున్నాయి. 
 
దీని ద్వారా ఆర్టీసీకి రూ.750 కోట్ల ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 2016లో చార్జీలను పెంచినప్పుడు ఆర్టీసీకి రూ.200 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరింది. అంతకుముందు 2009లో ఒకసారి, 2013లో మరోసారి చార్జీలు పెరిగాయి. ఇప్పుడు కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంపుతో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల చార్జీలు భారీగా పెరగనున్నాయి.