శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2020 (18:21 IST)

న్యాయవ్యవస్థపైనే నిందితుల దాడి ఆందోళనకరం

నిందితులే న్యాయవ్యవస్థపై దాడి చేయడం ఆందోళనకరమైన విషయమని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్‌మోహన్‌ రెడ్డి లేఖ రాయడం చాలా తీవ్రమైన అంశమని, దీనిపై న్యాయమూర్తులంతా ఏకతాటిపై నిలిచి ఖండించాల్సిన అవసరముందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
"సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ రెడ్డి లేఖ చాలా తీవ్రమైన అంశం. దీనిపై న్యాయమూర్తులంతా ఏకతాటిపై నిలిచి ఖండించాల్సిన సందర్భమిది.. ఏకతాటిగా వ్యవహరించకపోతే, నిందితులంతా ఇవే పోకడల్లో పోతారు. ప్రతి నిందితుడూ ఇకపై న్యాయవ్యవస్థను బెదిరిస్తారు. ఈ పెడధోరణులను అనుమతిస్తే న్యాయవ్యవస్థ తీవ్ర ఒత్తిళ్ల పాలవుతుంది. 
 
తొలినుంచి జగన్ రెడ్డి న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి అనుచరులు కూడా అదే పెడ పోకడల్లో పోతున్నారు. జగన్ రెడ్డిపై 31 కేసులు కోర్టుల ముందు ట్రయల్స్ లో ఉన్నాయి. ట్రయల్స్ నేపథ్యంలోనే ఈ లేఖ రాశారనేది సుస్పష్టం.నిందితులే న్యాయవ్యవస్థను బెదిరించడం నిత్యకృత్యం కారాదు. 
 
సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కేసుపై సీరియస్ గా స్పందించినట్లే,  జగన్ రెడ్డి లేఖపై కూడా న్యాయవ్యవస్థ సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇవే పోకడలు పోతే, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి ప్రమాదంలో పడుతుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువలు మంటగలుస్తాయి.
 
నిందితులు అత్యున్నత న్యాయమూర్తులనే బెదిరిస్తే, ఇక దిగువ కోర్టులు ఎలా పనిచేస్తాయి..? వెలుపలి బెదిరింపుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుదే.. దీనికి గాను న్యాయమూర్తులంతా వైరుధ్యాలు పక్కనపెట్టి ఏకతాటిపైకి రావాలి, సీరియస్ గా తీసుకోవాలి. 

న్యాయమూర్తులపై రాష్ట్ర చట్టసభల్లో చర్చించరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 211 నిర్దేశిస్తోంది. పార్లమెంటులో కూడా రాష్ట్రపతి ఆమోదంతోనే చర్చకు అనుమతించాలని ఆర్టికల్ 121 చెబుతోంది.

జగన్ రెడ్డి బృందం న్యాయవ్యవస్థపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. 
జగన్ రెడ్డి నిర్ణయాలు రాజ్యాంగ వ్యతిరేకం, చట్టబద్దపాలన(రూల్ ఆఫ్ లా)కు వ్యతిరేకం, కేంద్ర చట్టాలకు విరుద్ధం. రూల్ ఆఫ్ లా కు వ్యతిరేక నిర్ణయాలు కాబట్టే ప్రజలు వాటిపై కోర్టులకెక్కారు. అటువంటి నిర్ణయాలను పున : పరిశీలించే ప్రత్యేకాధికారాన్ని న్యాయస్థానాలకు రాజ్యాంగం కట్టబెట్టింది. 

ప్రాధమిక హక్కుల ఉల్లంఘన వంటి వివాదాస్పద నిర్ణయాలను నిలిపేయవచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 13(2) పేర్కొంది. హైకోర్టు పరిధిని ఆర్టికల్ 226 నిర్దేశిస్తే, సుప్రీంకోర్టుకు వెళ్లడంపై ఆర్టికల్ 32లో ఉంది. బాధిత వ్యక్తులు తమ రక్షణ కోసం న్యాయస్థానాల్లో అపీల్ చేసుకోవచ్చు.

పక్షపాతం చూపుతారనే అనుమానాలుంటే వేరే బెంచ్ కు మార్చవచ్చని కోరవచ్చు. కానీ మొత్తం న్యాయ వ్యవస్థపైనే బురద జల్లకూడదు. న్యాయమూర్తులపై చేసే వ్యాఖ్యలు కూడా కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయి. న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై బురద జల్లుతున్న జగన్ రెడ్డి బెయిల్ ను ఎందుకని రద్దుచేయ కూడదు..?
 
ప్రధాన న్యాయమూర్తికి జగన్ రెడ్డి రాసిన లేఖను భారత న్యాయవ్యవస్థ సీరియస్ గా తీసుకోవాలి. ఇటువంటి పెడ ధోరణులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. న్యాయమూర్తులను నిందితులే బెదిరించే దుష్ట సంస్కృతికి న్యాయవ్యవస్థ చరమగీతం పాడాలి. భవిష్యత్తులో ఇంకెవరూ ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా గుణపాఠం చెప్పాలి" అని ప్రకటనలో పేర్కొన్నారు.