బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాను ప్రభావం వల్ల ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సంసిద్ధం కావాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని నివార్ తుఫాన్ అంశంపై జిల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి జిల్లా, డివిజనల్, మండల అధికారుల తుఫాను నియంత్రణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి పుదుచ్చేరికి 700 కిమీలు, చెన్నైకి 740 కిమీలు దక్షిణ ఆగేయ దిశగా కేంద్రీకృతమై ఉందన్నారు.
నివార్ తుఫాన్ గా దీనికి నామకరణం చేసిన ఈ తుఫాన్ రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఈ నెల 25 వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరి తీరంలో కరైకల్, మామల్లాపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు.
నివార్ తుఫాన్ ప్రభావం దక్షిణ ఆంధ్ర తీరంతోపాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఉంటుందని వాతావరణ శాఖ సూచించిందని, ఈ మేరకు కాకినాడ (5), అమలాపురం (7), పెద్దాపురం (1) డివిజన్లలోని 13 తీరమండలాల్లో తుఫాను నియంత్రణ యంత్రాంగం అప్రమత్తం కావాలని, అధికారులు తమ తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
తుఫాను హెచ్చరిక నేపథ్యంలో అధికారులు, సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయడం జరగదని, ఇప్పటికే సెలవులో ఉన్న వారు వెంటనే విధులకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. తుఫాను నియంత్రణ, సహాయక చర్యల పర్యవేక్షణకు కలెక్టరేటుతోపాటు అన్ని డివిజన్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లు 24 గంటలు పనిచేయాలన్నారు.
తీర గ్రామాల్లో టాం-టాం ద్వారాను, వాలంటీర్లు విలేజి, వార్డు సచివాలయ సిబ్బందితోను, ప్రింట్, ఎలక్ట్రానిక్ మాద్యమాలలోను తుఫాను హెచ్చరికలు, జాగ్రత్తలపై విస్తృత అవగాహన, ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, సహాయ పునరావాస ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు.
తుఫాను కారణంగా సముద్రం కల్లోలితమయ్యే దృష్ట్యా మత్యకారులు సముద్ర వేటకు వెళ్లకుండా హెచ్చరించాలని, వేటలో ఉన్నవారంతా ఒడ్డుకు చేరుకోవాలని వివిధ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా సూచించాలని కోరారు. అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేసే స్థితిలో ఉండేలా చూడాలన్నారు.
ఈదురుగాలుల వల్ల చెట్లు కూలి రహదారి రవాణాకు ఏర్పడే అవరోధాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఆర్ అండ్ బి శాఖ, తాగునీటి సరఫరాకు విఘాతం లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ, విద్యుత్ అంతరాయాలను త్వరితగతిన చక్కదిద్దేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది, సాధనాలతో సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
తుఫాను గాలులు, వర్షాల నుండి పంటలను కాపాడుకునే జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలన్నారు. సహాయ, పునరావాస చర్యలకు అవసరమైన నిత్యావసరాలను తీర మండలాల్లో తగిన పరిమాణంలో నిల్వలు ఉంచాలని తహసీల్దారులు, పౌర సరఫరాల అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు ప్రామాణిక విపత్తు నియంత్రణ ప్రణాళికలను పాటిస్తూ ప్రాణ, ఆస్తుల హాని నివారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.