మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (18:44 IST)

ప్రభుత్వం వెళ్లాల్సింది గ‌డ‌ప ద‌గ్గర‌కు కాదు: నాదెండ్ల మనోహర్

శుక్ర‌వారం మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కేంద్ర కార్యాల‌యంలో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ..

“రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం, వాటి ప‌రిష్కారానికి, పార్టీ బ‌లోపేతానికి చేయాల్సిన కృషికి సంబంధించి అధ్య‌క్షుల వారు స్వ‌యంగా కార్యాచ‌ర‌ణ ఇచ్చే ల‌క్ష్యంతో  అన్ని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. దీన్ని ఒక గొప్ప అవ‌కాశంగా భావించి ప్ర‌తి ఒక్క‌రు ఈ ప్ర‌యాణంలో భాగ‌స్వాములు కావాలి.

నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క్షేత్ర స్థాయిలో ప‌ని చేసే తీరు, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పార్టీని ముందుకు తీసుకువెళ్లే విధానం ఆధారంగా గుర్తింపు ఇవ్వాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నిర్ణ‌యించారు. రాజ‌కీయాల్లో ఎద‌గాలంటే ఫోటోలు, వాట్స‌ప్‌ల‌కి ప‌రిమితం అయితే కుద‌ర‌దు. అధ్య‌క్షుల వారు ఇచ్చిన కార్యా‌చ‌ర‌ణ తు.చ. త‌ప్ప‌కుండా పాటించి గ్రామ స్థాయి వ‌ర‌కు తీసుకువెళ్ల‌గ‌లిగితేనే రానున్న ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వ‌గ‌లుగుతాం.

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు రావాలంటే అది ఇక్క‌డి నుంచే మొద‌లు కావాలి. విజ‌య‌వాడ నియోజ‌క‌వ‌ర్గం అంటే ఎంతో చైత‌న్యం ఉన్న ప్రాంతం. రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు తీసుకురావాలి అంటే, ఆ మార్పు ఇక్క‌డి నుంచే మొద‌లు కావాలి. ఈ రోజుల్లో ఒక రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

మీ ద‌గ్గ‌ర నుంచి త్యాగాలు అవ‌స‌రం. కార్య‌క‌ర్త‌లు నాయ‌కుడు లేడు అని భావిస్తే అది నాయ‌క‌త్వం లోపం కింద‌కే వ‌స్తుంది. నాయ‌కుల‌కి ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోక‌పోతే అధ్య‌క్షుల వారు ఎలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునేందుకైనా వెనుకాడ‌రు. నాయ‌క‌త్వం అంటే ఎలాంటి స‌మ‌స్య‌కైనా ఎదురు నిల‌బ‌డాలి, క‌ష్ట‌ప‌డాలి, స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేసి బాధితుల‌కు అండ‌గా నిల‌బ‌డాలి.

మీకు పార్టీ అండ‌గా ఉంటుంది. ప్ర‌భుత్వం నుంచి, అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీ మీకు అండ‌గా ఉంటుంద‌ని ఇప్పటికే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెప్ప‌డం జ‌రిగింది.  రాజోలు వ్య‌వ‌హారంలో చిన్న విష‌యాన్ని పెద్ద‌ది చేసి మ‌న ఎమ్మెల్యేని ఇబ్బందిపెట్టాల‌ని చూసిన‌ప్పుడు, అధ్య‌క్షుల వారు రెండు రోజుల పాటు గంట గంట‌కీ ప‌రిస్థితిని స‌మీక్షిస్తూనే ఉన్నారు. అవ‌స‌రం అయితే రోడ్డు మార్గం ద్వారా రాజోలు వెళ్లి అక్క‌డ ధ‌ర్నాకు దిగాల‌ని నిర్ణ‌యించారు.

వాట్స‌ప్‌ల‌లో స్పందిస్తేనే స్పందించిన‌ట్టు కాదు. ఎక్క‌డ ఏం జ‌రిగినా ఆయ‌న దృష్టికి వ‌స్తే, అవ‌స‌రం అయితే మీ ప్రాంతానికి ఓ నాయ‌కుడిని పంపి స‌మీక్ష‌లు జ‌రుపుతారు. వంద రోజుల వ‌ర‌కు ప్ర‌భుత్వ ప‌ని తీరుపై మాట్లాడ‌వ‌ద్ద‌నుకున్నాం. ఈ కొంత స‌మ‌యంలోనే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వం వెళ్లాల్సింది గ‌డ‌ప‌ల ద‌గ్గ‌ర‌కు కాదు.. ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లోకి వెళ్లాలి. ప్ర‌జ‌ల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నించాలి అని అన్నారు. 
 
 
పార్టీ నిర్ణయాన్ని కలసికట్టుగా అనుసరించాలి: పి.రామ్మోహన్ రావు 
పార్టీ పోలిట్‌బ్యూరో స‌భ్యులు పి.రామ్మోహ‌న్‌రావు మాట్లాడుతూ.. “మ‌నం ముందుగా క‌ల‌సిక‌ట్టుగా పార్టీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా దాన్ని అనుస‌రించాలి. మ‌న‌లో మ‌న‌కే స్ప‌ర్ధలు ఉంటే ఎన్న‌టికీ గెల‌వ‌లేం. మ‌నకి మీడియా స‌పోర్ట్ లేదు. సోష‌ల్ మీడియా బ‌లం ఉంది అనుకుంటే ఆ సోష‌ల్ మీడియానే మ‌న కొంప ముంచింది.

మీరు పార్టీ నిర్ణ‌యాన్ని అర్ధం చేసుకోకుండా కేవ‌లం న‌చ్చిన వ్య‌క్తికి టిక్కెట్ ఇవ్వ‌లేదు అని లేనిపోని దుష్ర్ప‌చారం చేసి పార్టీ ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాం. మ‌న ఓట‌మికి క్షేత్ర స్థాయిలో జ‌న‌ సైనికుల‌కి రాజ‌కీయంగా అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే కార‌ణం. బ‌లం లేక‌పోవ‌డం వల్ల కాదు.

ఈ అవ‌గాహ‌న స‌ద‌స్సుల ద్వారా రానున్న ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే అవ‌గాహ‌న పెంచుకుందామ‌ని తెలిపారు. సమావేశంలో ముత్తంశెట్టి ప్రసాదబాబు, పోతిన మహేశ్, బత్తిన రాము, అక్కల రామ్మోహనరావు పాల్గొన్నారు.