మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (21:06 IST)

ముస్లింల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు వైఎస్: మంత్రి కొడాలి

దేశ చరిత్రలో ఐదున్నర దశాబ్దాల తరువాత ముస్లిం మైనారిటీల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు.

మంగళవారం స్థానిక రాజేంద్రనగర్లోని ఇంటి దగ్గర మంత్రి కొడాలి నానితో కలిసి గుడివాడ బంటుమిల్లి రోడ్డు లోని మియాఖాన్ మసీదు (పెద్ద మసీదు) ఇమామ్ హఫీజ్ వఖారి ఆలే రసూల్ సయ్యద్ చాంద్ రజా ఖాద్రి ప్రార్థనలు చేయించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రి కొడాలి నానికి, రాష్ట్ర, గుడివాడ నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ అల్లాను ప్రార్థించారు.

లాక్ డౌన్ సమయంలో ఇమామ్ లు, మౌజన్ ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రూ.ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రి కొడాలి నానికి ముస్లిం మైనారిటీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి ఖర్జూర పండ్లను అందజేశారు.

పూలమాలలు వేసి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. వైయస్సార్ ముఖ్యమంత్రి కాకముందు ముస్లింలను పట్టించుకున్న ప్రభుత్వాలు లేవని అన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి అంటే రాజకీయాలలో పదవులు కాదనే విషయాన్ని దివంగత రాజశేఖరరెడ్డి బలంగా నమ్మే వారిని అన్నారు.

కఠిక పేదరికంలో ఉన్న మైనారిటీలకు భవిష్యత్తుపై దివంగత రాజశేఖర్ రెడ్డి ఆశ ,భరోసా కల్పించారన్నారు. ముస్లిం మైనారిటీల జీవితాలు మారాలంటే ఉన్నత చదువుల ద్వారానే అని నమ్మి వారికి 4% రిజర్వేషన్ లను కల్పించిన ఏకైక ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి నిలిచారన్నారు.

ఈ రాష్ట్రంలో ప్రతి మైనారిటీ కుటుంబాన్ని తన కుటుంబ సభ్యులుగా వైయస్సార్ కుటుంబం భావించిందన్నారు. ముస్లిం మైనారిటీల పిల్లలకు 4% రిజర్వేషన్ లతో పాటు మంచి చదువు, స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ కల్పించడంతో ఎంతోమంది ఉన్నత చదువులు చదివి ఇంజనీర్లు, డాక్టర్లు కాగలిగారన్నారు.

తండ్రి రాజశేఖరరెడ్డి ఆశయాలతో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని, ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి తండ్రి బాటలోనే నడుస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మొదటి ఐదు నెలల్లోనే అమలు చేశారన్నారు. ముస్లిం, మైనారిటీల సంక్షేమం కోసం 2019-2020 రాష్ట్ర బడ్జెట్ లో రూ.952 కోట్లు కేటాయించారని తెలిపారు.

ముస్లింలకు  వైయస్సార్ షాదీ కా తోఫాను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి రూ.లక్ష ఇస్తున్నారన్నారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యకు రూ. 15లక్షలు అర్దిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. మసీదుల్లో ఇమామ్ లకు గతంలో రూ.5 వేలు ఉంటే దానిని రూ.10వేలకు పెంచడం జరిగిందని,  మౌజన్ లకు రూ.3 వేల నుండి రూ.5వేలకు పెంచామని పేర్కొన్నారు.

ముస్లింలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రూ. 150 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే హజ్ యాత్రికులకు దేశ చరిత్రలో ఎవరూ  ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.60 వేలు, మూడు లక్షల పైన ఆదాయం ఉన్నవారికి రూ. 30వేల అర్దిక సహాయాన్ని అందజేస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు.

వైసిపి ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షుడు షేక్ బాజీ, సీనియర్ నేత రహమతుల్లా షరీఫ్ తదితరులు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత దివంగత రాజశేఖర్రెడ్డిది అయితే, క్యాబినెట్లో ముస్లింలకు డిప్యూటీ సీఎం హోదా కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిందని, ముస్లిం మైనార్టీలకు ఎవరు న్యాయం చేయలేదన్నారు.

దివంగత వైయస్సార్, సీఎం జగన్ మోహన్ రెడ్డిల హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు. గుడివాడ పట్టణంలో పదేళ్ల కిందటే మసీదుల అభివృద్ధికి మంత్రి కొడాలి నాని కృషి చేశారని, ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉండడం ముస్లింల అదృష్టమని అన్నారు. అనంతరం మంత్రి కొడాలి నానికి వినతి పత్రాన్ని అందజేశారు.

దరఖాస్తు చేసుకున్న కొంతమంది ఇమామ్ లు, మౌజన్ లకు రూ. 5 వేల సాయం అందలేదని, వీరికి కూడా ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నేతలు షేక్ కరీముల్లా, షేక్ మౌలాలి,  సయ్యద్, సర్దార్ బేగ్, బాబులు, సయ్యద్ గఫార్, సయ్యద్ సైదా, షేక్ సయ్యద్, ఇబ్రహీం బేగ్, మునీర్, హుస్సేన్ సయ్యద్, చిన్నా, సమద్, బాజానీ, రుహుల్లా, కార్పెంటర్ భాషా తదితరులు పాల్గొన్నారు.