శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (21:02 IST)

మహానీయుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే గద్దె రామమోహన్

దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది పోరాటాలు చేశారని, అనేకమంది ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగఫలాలనే మనం ఈనాడు అనుభవిస్తున్నామని ఆ మహానీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు.
 
శనివారం అశోక్ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్బన్ మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసనసభ్యులు గద్దె రామమోహన్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఆనాడు ఎందరో దేశభక్తులు అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని, ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో హింస పెరిగిపోతోందని, ప్రతి ఒక్కరూ అహింసా మార్గాల్లోనే నడవాలని కోరారు. నేటి యువతలో చాలామందికి దేశానికి స్వాతంత్ర్యం కోసం ఆనాడు చేసిన పోరాటాలు, త్యాగాలు తెలియవని ప్రభుత్వం నాటి పోరాటాలు తెలిసే విధంగా విద్యార్ధులను చైతన్య పరచాలన్నారు.

ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అందరినీ స్మరించుకోవడం మన బాధ్యత అని గద్దె రామమోహన్ తెలిపారు. రేయింబవళ్ళు మన దేశ సరిహద్దుల్లో మనకోసం కాపలా కాస్తున్న సైనిక సోదరులందరికీ సెల్యూట్ తెలియజేద్దామన్నారు. అలాగే కరోనా వైరస్ రాష్ట్రంలో పెద్దఎత్తున విస్తరిస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ను అరికట్టేందుకు తమవంతు కృషి చేయాలని గద్దె రామమోహన్ కోరారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు పొట్లూరి సాయిబాబు, శాయన సత్యనారాయణ, మహ్మద్ హయత్ ఖాన్, గద్దె ప్రసాద్, కామినేని రవికుమార్, గద్దె  రమేష్ గుళ్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.