గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (07:49 IST)

సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలు పారదర్శకంగా ఉండాలి: కృష్ణా జిల్లా కలెక్టరు

ప్రభుత్వం పథకాలు త్వరిత గతిన లబ్దిదారులకు చేరవేసేందుకు ఎంతో ప్రతిష్ట్రాత్మకంగా  ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు ద్వారా ప్రజలకు అందించే సేవల్లో ఎటువంటి వివక్షత లేకుండా పారదర్శకంగా సచివాలయ ఉద్యోగులు సేవలందించాలని కృష్ణా కలెక్టరు ఏఎండి ఇంతియాజ్  ఉద్యోగులను ఆదేశించారు. 

గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామ సచివాలయాన్ని కలెక్టరు  ఏఎండి ఇంతియాజ్ స్థాయి అధికారులతో కలసి ఆకస్మిక తనిఖీ చేసారు.  ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను నిర్థేశించిన సమంయంలోనే  ప్రజలకు చేరువ  చెయ్యాలన్నారు. 

శాఖల వారీ పనిచేస్తున్న పర్సన్ అసిస్టెంట్లు  ప్రజలకు అందించే శాఖా పరమైన సేవలను దరఖాస్తు దారుడు అర్జీ దాఖలు చేసిన గడువు లోపులోనే పరిష్కరించాలి తప్ప కాల వ్యాపన చేయరాదని కలెక్టరు  సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు.  ప్రజలకు అందించే సత్వర  సేవలపై ప్రతి విభాగానికి చెందిన ఉద్యోగులు దృష్టిని సారించి భాద్యతాయుతంగా పనిచెయ్యాలని  కలెక్టరు అన్నారు. 

ఇందులో ఎటువంటి అలసత్వానికి తావులేదని, ఎవరైనా భాద్యతారాహిత్యంగా పనిచేస్తే అటువంటి వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా కలెక్టరు నాడు-నేడు, సంక్షేమం, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు  సురక్షబీమా యోజన వంటి పలు పథకాలు అమలుపై లబ్దిదారులకు అందిస్తున్న సేవలను సచివాలయ పర్శన్ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సంక్షేమం విభాగం లో పనిచేస్తున్న పర్సన్ అసిస్టెంట్ కె. ప్రియాంకతో కలెక్టరు ఎంఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అమ్మఒడి పథకం క్రింద ఎంతమందికి ఇచ్చారు.  లబ్దిదారుల సురక్ష బీమా యోజన బ్యాంక్ ఖాతాలు ప్రారంచారా..మీ సచివాలయ పరిధిలో జగనన్న తోడు క్రింద ఎంత మంది లబ్దిదారులను ఎంపిక చేసారు.

వారిలో ఎంత మందికి  బ్యాంకు రుణాలు మంజూరు అయ్యాయి అనే అంశాలను కలెక్టరు ప్రశ్నించగా ఆవిధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ పర్సన్ అసిస్టెంట్ కె. ప్రియాంక వెంటవెంటనే కలెక్టరు  అడిగిన ప్రశ్నకు సమాదాలను ఇవ్వడంతో బాగా పనిచేస్తున్నారని ఇదే విధంగా భవిష్యత్తులో కూడా క్రమ శిక్షణతో భాద్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టరు ఆమెను అభినందించారు.

అదేవిధంగా నాడు నేడు, అమ్మఒడి, రెవిన్యూ, సర్వే విభాగపు పర్సన్ అస్టిసెంట్లు  నిర్వహిస్తున్న రిజిష్టర్లను కలెక్టరు తనిఖీ చేసారు. ఈ సందర్భంగా  తొలుత కలెక్టరు ఎఎండి ఇంతియాజ్ నిర్మాణ దశలో ఉన్న రెండు అంతస్తుల సచివాలయ భవనాన్ని కలెక్టరు పరిశీలించి త్వరిత గతిన నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలని పంచాయితీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

కలెక్టరు వెంట ఆర్డీవో జి. శ్రీనుకుమార్, తాహశీల్థారు ఆంజనేయులు, యంపీడీవో మణికుమార్, పంచాయితీ రాజ్, విఆర్వోలు, సచివాలయ ఉద్యోగులు, వాలెంటీర్లు తదితరులు ఉన్నారు.