మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:28 IST)

ద‌స‌రా ఉత్స‌వాల్లో స‌మ‌ర్ధంగా సేవ‌లు: పోలీసుల‌కు సీపీ అభినంద‌న

‌ద‌స‌రా ఉత్స‌వాల్లో స‌మ‌ర్థంగా విధులు నిర్వ‌హించి ప్ర‌శాంతంగా ముగిసేలా విధులు నిర్వ‌హించిన పోలీసులను న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు అభినందించారు. విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన అభినందన సభలో ఇంద్ర‌కీలాద్రిపై శ‌ర‌న్న‌వ‌రాత్రుల ఉత్స‌వాల్లో బందోబస్తు విధులు నిర్వహించిన పోలీస్ అధికారుల‌ను అభినందించి అనంత‌రం వారికి అమ్మవారి చిత్రపటంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

అనంత‌రం సీపీ బ‌త్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 17 నుండి 25వరకు ప్రతిష్టాత్మకంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురస్కరించుకుని దసరా పర్వదినంతో పాటు, మూలా నక్షత్రం, తెప్పోత్సవం రోజుల్లో భక్తుల రద్దీ దృష్యా నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, వాహనాల రాకపోకలకు అవాంతరాలు లేకుండా, ఎక్కడా చోరీలు జర‌గకుండా క్రైమ్ బృందాలు సమర్ధవంతంగా పని చేశార‌ని ప్ర‌శంసించారు.

ఉత్స‌వాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సమన్వయంతో పరస్పరం సహకారంతో విధులు నిర్వ‌హించార‌ని కొనియాడారు. ముఖ్యంగా కోవిడ్-19 సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులు, స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది అన్ని వేళలా అప్రమత్తంగా వ్యవహరించార‌ని, అంకిత భావంతో, బాధ్యతగా విధులు నిర్వహించి, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించార‌ని అభినందించారు.

ఈ సంద‌ర్భంగా భవిష్యత్తులో బందోబస్తు మెరుగుపర్చడానికి పోలీస్ అధికారుల నుండి సూచనలు వ్రాతపూర్వకంగా తీసుకున్నారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్-1 డీసీపీ వి.హర్షవర్ధనరాజు, అడ్మిన్ డీసీపీ మేరీ ప్రశాంతి, సిఎస్‌డబ్యూ డీసీపీ ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి, లా అండ్ ఆర్డర్-1 ఏడిసిపి ఎమ్.ఆర్.కె.రాజు, లాఅండ్ ఆర్డర్-2 ఏడిసిపి సీహెచ్ లక్ష్మీపతి, క్రైమ్ ఏడిసిపి యం.సుభాస్ చంద్రబోస్, ట్రాఫిక్ ఏడిసిపి టి.సర్కార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీలు ఎల్.అంకయ్య, సి.హెచ్.రవికాంత్, నగరంలో విధులు నిర్వహిస్తున్న మరియు ఇతర జిల్లాల నుండి వచ్చి బందోబ‌స్తు విధుల్లో పాల్గొన్న ఏడిసిపిలు, ఏసిపిలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.