దేశంలోనే ఇంత గొప్ప పాలన మరెక్కడా లేదు: మంత్రి పెద్దిరెడ్డి

peddireddy
ఎం| Last Updated: బుధవారం, 28 అక్టోబరు 2020 (08:30 IST)
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 7,68,965 మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. నోటిఫికేషన్ సమయంలో ఖాళీగా వున్న 16,208 పోస్ట్‌లను భర్తీ చేసేందుకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదిగా విడుదల చేశామని తెలిపారు.

ఈ ఉద్యోగాల కోసం 10.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 7.68 లక్షల మంది అర్హత సాధించడం సంతోషంగా వుందని అన్నారు. సచివాలయాలను ప్రారంభించిన తొలి ఏడాది నిర్వహించిన పరీక్షలకు సుమారు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, 18 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు.

తొలి విడతలో 1,26,728 మంది ఉద్యోగాలు సాధించారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 95,088 మంది, పట్టణప్రాంతాల్లో 36,110 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు.

మెరిట్ ఆధారంగా ఖాళీగా వున్న పోస్ట్‌ల భర్తీ
తాజాగా సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో మెరిట్ ఆధారంగా ఇప్పటి వరకు ఖాళీగా వున్న 18,048 పోస్ట్ లను భర్తీ చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

గతంలో మాదిరిగా కటాఫ్ మార్కుల విధానంను అమలు చేయడం లేదని, ఆయా విభాగాల్లో అభ్యర్థులు సాధించిన మెరిట్‌ను ఆధారం చేసుకుని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.

అర్హత సాధించిన వారిలో ఓసి కేటగిరిలో 1,08,854 మంది, బిసి కేటగిరిలో 3,88,043 మంది, ఎస్సీ కేటగిరిలో 2,24,876 మంది, ఎస్టీ కేటగిరిలో 55,192 మంది వున్నారని తెలిపారు. అర్హులైన వారిలో పురుషులు 3,84,129 మంది కాగా, మహిళలు 3,84,736 మంది వున్నారని తెలిపారు.

ఓసి, బిసి కేటగిరిల్లో అత్యధికంగా 111 మార్కులు, ఎస్సీ కేటగిరిలో 99.75 మార్కులు, ఎస్టీ కేటగిరిలో 82.75 మార్కులు, మహిళా కేటగిరిలో అత్యధికంగా 98 మార్కులు సాధించారని వివరించారు. నోటిఫికేషన్ నాటి తరువాత అదనంగా 178 గ్రామ, 1562 వార్డు సచివాలయాలు రావడంతో వాటిలో కూడా భర్తీ చేయాల్సిన పోస్ట్‌లను ఈ పరీక్షల్లో అర్హత సాధించిన మెరిట్ అభ్యర్ధులతో నింపుతున్నామని తెలిపారు.

ప్రజల ముంగిటకే సంక్షేమం
సీఎం వైయస్ జగన్ ఆలోచనల నుంచి ఏర్పడిన సచివాలయ వ్యవస్థ దేశంలోనే అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రజల చెంతకే ప్రభుత్వ సంక్షేమ పతకాలను చేరువ చేయడంలో గ్రామ, వార్డు సచివాలయాలు విజయవంతం అయ్యాయని అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అర్హత వున్న వారికి చేరువ అవుతుందనే విశ్వాసాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్లో కలిగించగలిగారని అన్నారు. దేశంలోనే ఇంత మరే రాష్ట్రంలోనూ లేదని అన్నారు. జాతీయ స్థాయిలో సచివాలయ వ్యవస్థకు అందుతున్న అభినందనలు ఇందుకు నిదర్శనమని అన్నారు.

ఇంత పెద్ద ఎత్తున పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఒక్క సీఎం వైయస్ జగన్ కే సాధ్యమయ్యిందని కొనియాడారు. ఎన్నికల్లో చెప్పిన హామీలు, మేనిఫేస్టోలో ఇచ్చిన వాగ్ధానాలను ఆచరణలో చూపుతూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.

ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తూ, అత్యంత పారదర్శకంగా, ఒక్క చిన్న విమర్శ కూడా రాకుండా ఉద్యోగాల నియామక ప్రక్రియను నిర్వహించడం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.

సచివాలయ ఉద్యోగాల భర్తీలో చిత్తశుద్దితో పనిచేసిన పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ఈ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు.దీనిపై మరింత చదవండి :