ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , సోమవారం, 22 నవంబరు 2021 (16:22 IST)

మూడు రాజధానుల ఉపసంహరణ పూర్తిగానా? మ‌ళ్ళీ ఇదే రిపీటా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సి.ఆర్.డి.ఏ, మూడు రాజ‌ధానుల బిల్లును ఊప‌సంహ‌రించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర తార్మానం ప్ర‌వేశ‌పెట్టి, సుదీర్ఘ చ‌ర్చ కూడా చేశారు. దీనితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అమ‌రావ‌తి రైతులు, మ‌రికొంద‌రు త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం అంత తేలిక‌గా మూడు రాజ‌ధానుల‌ను ఉప‌సంహ‌రించుకుందా? ఇది తాత్కాలిక‌మేనా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. 
 
 
మరో రూపంలో మ‌రోసారి ఈ బిల్లు ప్రవేశ పెట్టడానికే, ఈసారి వ్యూహాత్మ‌కంగా వెన‌క్కి తీసుకున్నార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. క్యాబినెట్ అత్యవసర భేటీలో మూడు రాజధానుల అంశంపై ప్రజెంటేషన్ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ఇచ్చారు. పలు దశల్లో ఎదురైన చిక్కులను సమగ్రంగా వివ‌రించారు. ప్రస్తుతం ఉన్న రూపంలో చిక్కులు తప్పవనే అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వం, పూర్తి స్థాయిలో కసరత్తు అనంతరం మరో రూపంలో ఈ బిల్లును తీసుకుని వచ్చే అవకాశం ఉంద‌ని పేర్కొంటున్నారు.
 
 
ఏ కోర్టూ అడ్డుకట్టలు వేయలేని విధంగా కొత్త బిల్లు రూపకల్పన కోసం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో క‌న్నా ఇపుడు మండలిలో వైసిపి ఆధిపత్యం రావడం, కోర్టులలో కూడా బిల్లుకు ఎటువంటి అడ్డంకులు రాకుండా, ఈసారి పకడ్బందీగా బిల్లు రూపకల్పన  చేయాల‌నే ఉద్దేశంతోనే ఈసారి వ్య‌హాత్మ‌కంగా అడుగులు వేసార‌ని తెలుస్తోంది. 

 
గ‌తంలో ఈ మూడు రాజ‌ధానుల బిల్లు కౌన్సిల్‌లో బిల్ హోల్డ్ అయింది. దానిని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తున్నా అని చైర్మన్ అన్నారు. అందుకే అది బిల్ ఫామ్ అవ్వలేదు. ఆ కోణంలో మూడు రాజ‌ధానుల బిల్లు న్యాయ‌స్థానంలో కూడా అడ్డుప‌డే అవకాశం ఉంద‌ని భావిస్తున్నారు. అందుకే ఫ్రెష్ బిల్ రూపంలో తిరిగి దీనిని కౌన్సిల్‌లో కూడా సంపూర్ణ మెజారిటీతో తీసుకువ‌స్తార‌ని తెలుస్తోంది.