1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (14:55 IST)

బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది... తిరుపతి రాజధానిగా చేయండి : చింతా మోహన్

బహ్మంగారి కాలజ్ఞానంలోనే ఉందని, అందువల్ల తిరుపతి పట్టణాన్ని నవ్యాంధ్ర రాజధానిగా చేయాలని తిరుపతి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో తాజా రాజకీయ వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
దేశం, రాష్ట్రం నాశనం అవుతోందని వాపోయారు. మౌనంగా ఉండడం ఇష్టం లేక నోరు విప్పుతున్నానని, రాష్ట్ర విభజనకు కారకుడు తన మిత్రుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. అప్పటి కోట్ల విజయభాస్కరరెడ్డిని గద్దె దించేందుకు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది వైఎస్ఆర్ అని చెప్పుకొచ్చారు. 
 
మర్రి చెన్నారెడ్డితో మెదలైన ఉద్యమం ఉస్మానియాకు చేరిందన్నారు. అనంతరం కేసీఆర్ సారథ్యం వహించారని, సీపీఎం తప్ప అన్ని పార్టీలు రాష్ట్ర విభజన కోసం ఉత్తరాలు ఇచ్చాయన్నారు.
 
విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ సర్కార్ హామీ ఇచ్చిందని, తిరుపతిని రాజధాని చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తాను ఉత్తరం కూడా రాశానని గుర్తుచేశారు. 
 
తిరుపతి చూట్టూ లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారి కాల జ్ఞానంలో కూడా ఉందన్నారు. తుళ్లూరు రాజధానిగా సాధ్యం కాదని, అది శపించబడిన స్థలమని చంద్రబాబుకు ముందే చెప్పానన్నారు. 
 
తుళ్లూరు శపించబడిన స్థలమని, ఆ స్థలంలో చంద్రబాబు అడుగు పెట్టి మటాస్ అయ్యారని, అంజయ్య, భవనం వెంకట్రామ్, ఎన్టీఆర్ పదవులు సైతం పోయాయన్నారు. తుళ్లూరులో అడుగుపెడితే పదవి గండం తప్పదన్నారు. 
 
చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి.. తిరుపతికి 14 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. టీడీపీ మునిగిపోయే నావా అన్నారు. చంద్రబాబు చెల్లని రూపాయని, ఆయన పని అయిపోయిందన్నారు. ఎన్నికలలో సమయంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. 
 
ప్రభుత్వ అధికారులపై నెత్తిన ఉమ్ము వేసే రోజు దగ్గరలో ఉందన్నారు. బోగస్ ఎన్నికలను నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. అమ్మ ఒడి వల్ల 5 లక్షల మంది ప్రైవేటు టీచర్స్ రోడ్డున పడ్డారన్నారు. 50 వేల ప్రైవేటు విద్యా సంస్థలు మనుగడ కోల్పోయాయన్నారు. 
 
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక చరిత్రలో నిలబడిపోతుందని జోస్యం చెప్పారు. దేశ భవిష్యత్తుకు ఒక టర్నింగ్ పాయింట్ అన్నారు. అజ్ఞానంతో మోడీ పరిపాలన చేస్తున్నారని, తిరుపతి ఉప ఎన్నిక చంద్రబాబు, జగన్ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాదని, దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలివని తెలిపారు.