సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (12:42 IST)

తిరుపతి తెదేపా కంచుకోట... ఒక్క స్థానంలో గెలిచామంటే అవమానంగా లేదా?

ఆది నుంచి తిరుపతి పట్టణ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి జైకొడుతూ వచ్చారు. అందుకే తిరుపతి టీడీపీ కంచుకోటల్లో ఒకటి. కానీ, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక్కటంటే ఒక్క వార్డులోనే గెలిచింది. దీనిపై పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న తిరుపతిలో ఒకేఒక కార్పొరేటర్‌ గెలిచాడని చెప్పుకోవడం అవమానకరంగా ఉందన్నారు. 
 
మున్సిపల్‌ ఎన్నికల్లో తమతో సమన్వయం చేసుకోకుండా వ్యవహరించారని తిరుపతి నగర అధ్యక్షుడిపై పోటీ చేసిన పలువురు అభ్యర్థులు చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా... ఉప ఎన్నికలో మెజారిటీ చూపించకపోతే నాయకత్వంలో ప్రక్షాళన జరుగుతుందన్నారు. 
 
'స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన దౌర్జన్యాలు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ చేద్దామంటే కుదరదు. ఒకవేళ అలాంటి ఆకృత్యాలు చేయాలని వైసీపీ నేతలు వచ్చినా, వాటిని సమష్టిగా ఎదుర్కొని తాడో పేడో తేల్చుకోవాలి' అంటూ పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. 
 
గురువారం విజయవాడలో పార్టీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక సమీక్ష నిర్వహించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ముఖ్యంగా నియోజకవర్గ నాయకుల మధ్య సమన్వయం ఉండాలి. ఇదివరకటిలా వ్యవహిరించి ఇష్టమొచ్చినట్టు పార్టీకి నష్టం కలిగేలా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. అలాంటివారు పార్టీనుంచి వెళ్లిపోవడమే మేలు. లేకుంటే నేనే సస్పెండ్‌ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.