శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 25 జూన్ 2018 (21:15 IST)

వాడు పెట్టే భిక్ష నాకు అవసరం లేదు... వైసీపిలో 'జేసీ' టైపు నేత...

తెలుగుదేశం పార్టీలో జెసి దివాకర్ రెడ్డి తరహాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోను మరో నేత తెగ హడావిడి చేసేస్తున్నాడు. సొంత పార్టీని పొగుడుతూనే మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆ పార్టీకి తలనొప్పిగా మారాడు. దీంతో ఆయన ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేస

తెలుగుదేశం పార్టీలో జెసి దివాకర్ రెడ్డి తరహాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోను మరో నేత తెగ హడావిడి చేసేస్తున్నాడు. సొంత పార్టీని పొగుడుతూనే మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆ పార్టీకి తలనొప్పిగా మారాడు. దీంతో ఆయన ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అర్థంకాక  తలలు పట్టుకుంటున్నారు ఆ పార్టీ పెద్దలు. ఇంతకీ  వైసిపిలో కాకరేపుతున్న ఆ నేత ఎవరు.. పార్టీకి అంతగా ఇబ్బంది కలిగించిన వ్యాఖ్యలు ఏమిటి? 
 
తెలుగుదేశంపార్టీ ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా తనదైన శైలిలో చేసే వ్యాఖ్యలు సొంత పార్టీకే ఇబ్బందిగా మారిపోతుంటుంది. నాలుగేళ్ళ క్రితం టిడిపిలో చేరిన దివాకర్ రెడ్డి అప్పటి నుంచి అడపాదడపా టిడిపికి షాక్‌లు మీద షాక్‌లు ఇస్తున్నారు. ఏకంగా చంద్రబాబుపైనే సెటైర్లు వేసిన సంధర్భాలు ఉన్నాయి. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఎంపి సిఎం రమేష్‌ చేస్తున్న దీక్షకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన జెసి ఆయనపైనే వ్యంగాస్త్రాలు సంధించారు జెసి. టిడిపి దీక్ష వల్ల ఉక్కు కాదు కదా తుక్కు కూడా రాదంటూ, అలాగే చంద్రబాబు కుయుక్తులకు మోడీ లొంగడంటూ వ్యాఖ్యలు చేసి టిడిపిని ఇబ్బందుల పాలు చేశారు. 
 
అదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే ఒక నేత పుట్టుకొచ్చారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కక్కలేక, మింగలేక సతమవుతున్నారు వైసిపి నేతలు. ఆయన ఎవరో కాదు తిరుపతి తాజా మాజీ ఎంపి వరప్రసాద్. రాజీనామా ఆమోదం పొందిన తరువాత తరువాత తొలిసారిగా తిరుపతిలో అడుగుపెట్టిన ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో వైసిపికి మద్థతు తెలుపుతారని, తనతో ఆ విషయాన్ని చెప్పారని వరప్రసాద్ బాంబు పేల్చారు. 
 
గత పార్లమెంటు సమావేశాల్లోను జనసేన అధినేతపై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సమయంలో వాటిని కప్పి పుచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడింది వైసిపి. మళ్ళీ అదే వ్యాఖ్యలు చేస్తూ వైసిపిని ఇరుకున పెడుతున్నారు వరప్రసాద్. తాజాగా శ్రీకాళహస్తిలో బిసిల సదస్సుకు హాజరైన వరప్రసాద్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వచ్చే ఎన్నికల్లో బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వకపోతే తాను ఎంపిగా పోటీ చేయనంటూ మరోసారి శివాలెత్తారు. వైసిపి తరపున బిసి సదస్సుకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన ఆయన తన పార్టీ గురించే గొప్పగా చెప్పారని అందరూ భావించారు. పార్టీని బెదిరింపు ధోరణితో వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. జగన్‌ను వాడు అని సంబోధించడమే కాకుండా ప్రజాప్రతినిధిగా అవ్వడానికి వాడు(జగన్) పెట్టే భిక్ష నాకు అవసరం లేదని మండిపడ్డారు. 
 
ఎక్కువ సీట్లు ఇవ్వాలని పార్టీని అడగాలే తప్ప ఇవ్వకపోతే పార్టీలో ఉండనంటూ వ్యాఖ్యలు చేయడంపై వైసిపి నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతానంటున్నారు కొంతమంది నాయకులు. దీంతో మళ్ళీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో.. పార్టీకి ఎలాంటి ఇబ్బందులు తీసుకువస్తారేమోనని హడలిపోతున్నారు వైసిపి నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెసిగా వరప్రసాద్ పేరు తెచ్చుకుంటున్నారు. మరి వరప్రసాద్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాల్సిందే.