సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (13:24 IST)

పైసా ఆస్తులు లేని చింతా మోహన్‌... రత్నప్రభ ఆస్తులు రూ.25 కోట్లు

తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైకాపా, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ - జనసేన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరంతా ఇప్పటికే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ ఘట్టం ముగిసింది.
 
అయితే, ఈ ఎన్నికలో వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ తరపున పనబాక లక్ష్మి, కాంగ్రెస్ తరపున చింతా మోహన్, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. వీరిలో రత్నప్రభ అందరి కంటే సంపన్నమైన వ్యక్తిగా నిలిచారు. 
 
గతంలో కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె... తనకు రూ.25 కోట్ల విలువైన ఆస్తి (భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి) ఉన్నట్టు ప్రకటించారు. ఇందులో చరాస్తుల విలువ రూ.3.5 కోట్లుగా పేర్కొన్నారు. రూ.52 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.
 
ఇకపోతే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా పని చేసిన చింతా మోహన్ తనకు ఆస్తులు లేవని ప్రకటించడం గమనార్హం. ఇకపోతే, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తనకు రూ.10 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తనకు రూ.40 లక్షల ఆస్తి ఉన్నట్టు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు.