మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (07:35 IST)

ఉప ఎన్నిక : తిరుపతిలో పవన్ కళ్యాణ్ వీధివీధిలో పాదయాత్ర

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక త్వరలో జరుగనుంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 3వ తేదీన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతిలో పర్యటిస్తారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. ఎంఆర్‌పల్లి సర్కిల్‌ నుంచి శంకరంబాడీ వరకు పవన్‌కల్యాణ్‌ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. పాదయాత్ర తర్వాత పవన్‌ బహిరంగ సభలో మాట్లాడతారని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పవన్‌ రెండో విడత పర్యటన నెల్లూరు జిల్లాలో ఉంటుందని నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. 
 
అలాగే, తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొనే అవకాశం ఉంది. బైబిల్‌ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలంటూ కొద్ది రోజుల కిందట ఆయన చేసిన ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. పక్కా హిందూత్వ వాదిగా ముద్రపడిన  సంజయ్‌కి తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఈ ప్రకటనతో అభిమానులు పెరిగారు. 
 
ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో సంజయ్‌‌లాంటి నాయకుల ప్రచారం తమకు గట్టి ఊతమిస్తుందని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రచారంలో పాల్గొనాలంటూ మూడు రోజులుగా ఆయనపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ 14న తిరుపతిలో నిర్వహించే భారీ ర్యాలీలో సంజయ్‌ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.