మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (15:45 IST)

ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు యుద్ధ ఖైదీలా? కోదండరాం

ఆర్టీసీ కార్మికులను యుద్ధ ఖైదీల్లా చూశారంటూ తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు గత 23 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆర్టీసీ కార్మికలను తెరాస సర్కారు చర్చలకు ఆహ్వానించింది. 
 
దీంతో ఆర్టీసీ తాత్కాలిక ఎండీతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఆ సమయంలో వారిని అవమానంగా చూశారనే వార్తలు వచ్చాయి. వీటిపై కోదండరామ్ స్పందిస్తూ, శనివారం చర్చల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను యుద్ధ ఖైదీల్లా చూశారని ఆరోపించారు. 
 
ఆర్టీసీ విషయంలో కోర్టు చేసిన సూచనలను పాటించాలని ఆయన సూచించారు. తప్పును కార్మిక సంఘాల మీద నెట్టాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ సర్కారు సరైన రీతిలో స్పందించి వెంటనే చర్చలు సఫలం అయ్యే దిశగా కృషి చేయాలని అన్నారు.
 
కాగా, ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తమకు సమ్మె విరమించాలనే ఉందని అధికారులను చెప్పామని అన్నారు. నిన్న వారు అసలు చర్చలు జరపలేదని, ఈ రోజు పిలిచినా చర్చలకు వస్తామని చెప్పారు. ఆర్టీసీని విలీనం చేస్తే యూనియన్లు ఉండరాదన్న సీఎం కేసీఆర్ కోరిక కూడా నెరవేరుతుందని అన్నారు.