శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (21:33 IST)

రేపు కేబినెట్ భేటీ... నిపుణల కమిటీ నివేదికపైనే ప్రధాన చర్చ..!

రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రాభివృద్ధితో పాటు రాజధానుల ప్రతిపాదనలపై జీఎన్​ రావు కమిటీ ఇచ్చిన నివేదిక గురించి ప్రధానంగా చర్చించనుంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో కేబినెట్‌ భేటీ నేపథ్యంలో... రైతుల నుంచి నిరసనలు రావచ్చన్న నిఘావర్గాల సమాచారంతో... అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.

కేబినెట్ భేటీ సచివాలయంలోనా... లేదా క్యాంప్‌ ఆఫీసులో నిర్వహించాలా అనేదానిపై చర్చ జరుగుతోంది. మూడు రాజధానులపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను కెబినెట్ ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై చర్చించే అవకాశాలున్నాయి. రాజధాని రైతుల అభిప్రాయాల సేకరణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు, పంటలకు మద్దతు ధర తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఏపీఐఐసీ ద్వారా వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సీఆర్డీఏలో ఐఏఎస్​లు కొన్న ప్లాట్లకు డబ్బులు తిరిగి చెల్లించే అంశంపైనా కేబినెట్ చర్చించనుంది.
 
రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి: బైరెడ్డి
రియల్ ఎస్టేట్ దందా కోసమే రాజధానిని అమరావతి నుంచి మారుస్తున్నారని... మాజీఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. అన్ని విధాలా నష్టపోయిన రాయలసీమను రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖను రాజధానిగా చేయడానికే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

కర్నూలులోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రియల్ ఎస్టేట్ దందా కోసమే రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చెందిన విశాఖను ముఖ్య పట్టణంగా మారిస్తే ఉపయోగమేంటని ప్రశ్నించారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో సీమకు ఒరిగే లాభమేమీ లేదన్నారు. నాటి నుంచి అన్ని విధాలా నష్టపోయినా సీమ ప్రాంతాన్ని... రేపటి కేబినెట్ భేటీలో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.