శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (18:49 IST)

శాంతి భద్రతలు కొరవడిన గ్రామాల్లో 9న పర్యటన...టీడీపీ

రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు ఉన్నాయా అని వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యకులు జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు.

రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "గుంటూరు జిల్లా పల్నాడులోని అనేక గ్రామాల్లో ప్రజల ప్రశాంతంగా ఉండే పరిస్థితులు లేవు. రాజకీయ కక్ష సాధింపులు, ఓటు వేయలేదనే సాధింపులు, అక్రమంగా ఆక్రమించుకోవడం, ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో పల్నాడులోని గురజాల, మాచర్ల, నర్సరావుపేట నియోజకవర్గాల్లో శాంతిభద్రతలు కొరవడిన గ్రామాల్లో టీడీపీ కార్యాచరణకు దిగనుంది. 9వ తేదీన చలో పల్నాడు-సేవ్‌ డెమోక్రసీ పేరుతో ఆయా గ్రామాల్లో పర్యటించనున్నాం. మేం డీఎస్పీని కలిసి ఉన్న పరిస్థితులను, వాస్తవాలను మరోసారి తెలియజేస్తాం.

రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ పూర్తిగా మర్చిపోయారు. ఒక వర్గంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లుగా ఈ పరిణామాలు ఉన్నాయి తప్ప ప్రజలకు సపరిపాలన అందించాలన్న ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదు. ప్రజలు ప్రశాంత జీవనం గడిపేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

దీనిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇలాంటి పరిస్థితుల్లో గురజాల నియోజకవర్గంలోని పది గ్రామాలు పిన్నెల్లి, జింకలపాలెం, చెన్నాయిపాలెం, మోర్జంపాడు, పిడుగురాళ్ల, కోనంకి, తుమ్మల చెరువు, కరాలపాడు, పందిరిపాలెం దాచేపెల్లి, ముత్యాలంపాడు, నర్సరావుపేట నియోజకవర్గంలోని 5 గ్రామాలు రామిరెడ్డి పాలెం, కొనకంచి వారిపాలెం, అరవపల్లి, పెట్లూరి వారిపాలెం, మాచర్ల నియోజకవర్గంలో 8 గ్రామాల్లో 9వ తేదీన టీడీపీ నేతలు, నాయకులు పర్యటించనున్నారు.

ఆయా గ్రామాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తాం.  గ్రామాల్లో శాంతి నెలకొల్పాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. వైసీపీ ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. 9 వ తేదీన మేం ప్రజలకు ఒక భరోసా కల్పించనున్నాం. వైసీపీ గూండాయిజం, రౌడీయిజానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.

మేం డీఎస్పీని కలిసి ఉన్న పరిస్థితులను, వాస్తవాలను మరోసారి తెలియజేస్తాం. గతంలో డీజీపీని కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించాం. మెరుగుపడుతాయని ఆశించాం. అవేమీ జరగలేదు. వైసీపీ చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. గ్రామాల్లో శాంతి భద్రతలు ఆధీనంలోనే ఉన్నాయని అబద్ధాలు చెబుతున్నారు.

9వ తేదీన జిల్లా ముఖ్య నాయకులు వెళ్లి ఆయా గ్రామాల్లో పరిస్థితులను వాకబు చేసి వాస్తవాలు మేం ప్రజలకు చెబుతాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం. ప్రజాస్వామ్యవాదులందరూ ప్రభుత్వ తీరును ఖండించాలి. కార్యకర్తలు, ప్రజలకు మేం అండగా నిలబడతాం. గ్రామాల్లో శాంతి నెలకొనే వరకు ప్రభుత్వంపై పోరాడతాం" అన్నారు.
 
మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు మాట్లాడుతూ.. "భారత రాజ్యాంగం ప్రజలకు జీవించే హక్కు కల్పించింది. ఆస్తులు సంపాదించుకునే, అనుభవించే హక్కు కల్పించింది. ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి సహజం. అయితే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలు ఇన్నీ అన్నీ కావు.

ప్రజలు జీవించే హక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినం. దీనిని తీవ్రంగా ఖండించాలి. పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. పోలీసు వ్యవస్థ విఫలమైతే న్యాయ పరిరక్షణ కోసం అనేక వ్యవస్థలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అధికార తొత్తులుగా వ్యవహరించడాన్ని పోలీసులు మానుకోవాలి. కార్యకర్తలకు భరోసాగా టీడీపీ ఉంటుంది" అన్నారు.