బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (16:52 IST)

అర్జిత సేవల పునరుద్ధరణ - టిక్కెట్ల ధరలు పెంపు : తితిదే నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు గురువారం సమావేశమైంది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా, కరోనా వైరస్ కారణంగా నిలిపివేసిన అర్జిత సేవలను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయిస్తూనే, ఈ టిక్కెట్ల ధరలను పెంచాలని కీలక నిర్ణయం తీసుకుంది. 
 
సుప్రభాత సేవకు రూ.2 వేలు, తోమాల, అర్చన సేవా టిక్కెట్ ధర రూ.5 వేలు, వేద ఆశీర్వచనానికి రూ.10 వేలు, కళ్యాణోత్సవానికి రూ.2500, వస్త్రాలంకరణ సేవా టిక్కెట్ ధరను రూ.లక్షకు పెంచాలని తితిదే నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు, 2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌కు కూడా ఆమోదం తెలిపింది. మొత్తం రూ.3,096 కోట్ల అంచనాతో ఈ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ.230 కోట్ల వ్యయంతో పద్మావతి చిన్నపిల్లల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని తితిదే బోర్డు నిర్ణయించింది. 
 
స్విమ్స్ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని తీర్మానించింది. ముఖ్యంగా ఆస్పత్రిలో కంప్యూటరీకరణ కోసం రూ.2.7 కోట్లను కేటాయించింది. అలాగే, ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు వీలుగా రూ.25 కోట్లను కేటాయించింది. అదేవిధంగా తిరుమలలో సాగుతున్న అన్నదానాన్ని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించింది.