ఆదివారం, 10 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 26 ఆగస్టు 2017 (15:24 IST)

శ్రీవారి మూలవిరాట్ ముందే బండబూతులు.. తిట్టిందెవరో తెలిస్తే షాకే...

తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న విశిష్టత అంతాఇంతా కాదు. అందులోను స్వామివారి మూల విరాట్ ముందుకు వెళితే ఎవరైనా సరే భక్తితో రెండు చేతులెత్తి గోవిందా అంటూ దణ్ణం పెట్టాల్సిందే. అప్పటివరకు స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న భక్తితో ఉన్న భక్తులెవరైనా స్

తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న విశిష్టత అంతాఇంతా కాదు. అందులోను స్వామివారి మూల విరాట్ ముందుకు వెళితే ఎవరైనా సరే భక్తితో రెండు చేతులెత్తి గోవిందా అంటూ దణ్ణం పెట్టాల్సిందే. అప్పటివరకు స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న భక్తితో ఉన్న భక్తులెవరైనా స్వామివారి ముఖారవిందాన్ని చూసిన తరువాత నోటమాట రాదు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా కొన్ని సెకన్ల పాటు కలిగే స్వామివారి దర్శనభాగ్యంతో అన్నీ మర్చిపోతారు భక్తులు. 
 
అలాంటి శ్రీవారి ఆలయం ఎంతో విశిష్టమైనది...పవిత్రమైనది. కానీ అలాంటి ఆలయంలో కొంతమంది టిటిడి సిబ్బంది దురుసు ప్రవర్తనతో భక్తులు అల్లాడిపోతున్నారు. భక్తుల పట్ల అసభ్యంగా మాట్లాడటం ఈమధ్య కాలంలో టిటిడి సిబ్బందికి ఎక్కువై పోయింది. క్యూలైన్లలో మెల్లగా నడిస్తే వారిని మెడపట్టి మరీ తోసేస్తున్నారు కొంతమంది టిటిడి సిబ్బంది. తోసేస్తా ఫర్వాలేదు గాని బండబూతులు తిడుతున్నారు. అది కూడా స్వామివారి మూలవిరాట్ ముందే. ఇలాంటి సంఘటనే శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగింది. 
 
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక భక్త బృందం తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. ఎలాగోలా స్వామి ఆలయంలోకి వెళ్ళిన భక్తులు స్వామిని చూద్దామనుకుంటున్న సమయంలో వెనుక నుంచి మరికొంతమంది భక్తులు తోసుకోవడం ప్రారంభించారు. దీంతో భక్తబృందంలోని ఒక భక్తుడు స్వామిని చూడకుండానే ముందుకు తోయబడ్డాడు. ఆ విషయాన్ని టిటిడి సిబ్బందికి చెప్పాడు. నీకు స్వామి దర్శనం కాకుంటే మేమేమి చేస్తాం.. నీ కర్మ... వెళ్ళు అంటూ మెడ పట్టుకుని స్వామి వారి మూల విరాట్ ఇవతల నుంచి జయ, విజయల వరకు తోసుకుంటూ వచ్చారు. అంతటితో ఆగలేదు.. వదలండి సర్.. నేనే వెళ్ళిపోతానని భక్తుడు బతిమాలుతుంటే బూతులు తిట్టడం ప్రారంభించారు టిటిడి సిబ్బంది.
 
అది కూడా అలాంటి ఇలాంటి బూతులు కాదు. కొంతమంది మహిళా భక్తులు చెవులు మూసుకున్నారంటే ఆ బూతులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనవసరం లేదు. టిటిడి సిబ్బందిని వారించేందుకు కొంతమంది భక్తులు ప్రయత్నించారు. వారించిన వారిని కూడా సదరు సిబ్బంది బండబూతులు తిట్టడం ప్రారంభించారు. దీంతో ఆ భక్తుడు ఏడ్చుకుంటూ ఆలయం బయటకు వచ్చేశాడు. జరిగిన విషయాన్ని తిరుపతిలో ఉన్న టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దృష్టికి తీసుకెళ్ళాడు. ఈ విషయంపై విచారణ జరిపిస్తామని ఈఓ హామీ ఇవ్వడంతో ఆ భక్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి ఆ బూతుల సిబ్బందిని అక్కడ నుంచి సాగనంపుతారో లేదో చూడాలి.