బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (20:40 IST)

ఎస్వీ వేద వ‌ర్సిటీ ప‌రిధిలోకి టిటిడి వేద పాఠ‌శాల‌లు : టిటిడి ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో టిటిడి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న 6 వేద పాఠ‌శాల‌ల‌ను తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలోకి తీసుకొస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌ రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఈవో అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ వేద విద్య‌ను అభ్య‌సించేందుకు విద్యార్థుల‌కు ఉండాల్సిన అర్హ‌త‌లు, ఎంపిక విధానం, అడ్మిష‌న్లు, పాఠ్యాంశాలు, కోర్సుల రూప‌క‌ల్ప‌న‌, స‌ర్టిఫికెట్ల ప్ర‌దానం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి విధి విధానాలు రూపొందించేందుకు త్వ‌ర‌లో ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌న్నారు. 
 
ఈ క‌మిటీలోని పండితులు ఒక నెల లోపు నివేదిక స‌మ‌ర్పించాల‌ని సూచించారు. వేద పాఠ‌శాల‌ల‌న్నీ ఒకే గొడుగు కిందికి రావ‌డం వ‌ల్ల విద్యార్థుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని వివ‌రించారు. వేద విద్య‌ను మ‌రింత విస్తృతం చేసేందుకు ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.
 
ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్‌, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, కీస‌ర‌గుట్ట‌, చిలుకూరు, న‌ల్గొండ‌, కోట‌ప్ప‌కొండ‌, ఐ.భీమ‌వ‌రం, విజ‌య‌న‌గ‌రం వేద పాఠ‌శాల‌ల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.