ఏపీలో రెండు విద్యుత్ వాహనాల తయారీ పరిశ్రమలు
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల తయారీ పరిశ్రమల స్థాపనకు రెండు సంస్థలు ముందుకొచ్చాయని ఏపీ పరిశ్రమలు, పెట్టుబడుల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.
కోవిడ్ కారణంగా పారిశ్రామిక రంగం దెబ్బతిందని, సిఎం జగన్ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ, రాయితీల వల్ల తిరిగి కోలుకుందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచామన్నారు. కాలుష్య రహిత పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 30 నైపుణ్య శిక్షణా కేంద్రాలను, తిరుపతిలో ఒక నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని, ఐటి యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో రూ.15 కోట్లతో అదానీ డేటా సెంటర్ ఏర్పాటవుతోందన్నారు. విజయనగరం జిల్లాలో త్వరలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం ప్రారంభం కానుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్‌సి పి.సురేష్‌బాబు, ఎంఎల్‌ఎలు బడ్డుకొండ అప్పలనాయుడు, బత్స అప్పలనరసయ్య, అలజంగి జోగారావు, కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.