బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2023 (13:01 IST)

వైకాపా తీవ్ర వ్యతిరేకత.. ఎమ్మెల్యేల స్థానంలో వలంటీర్లను అభ్యర్థులుగా నిలబెట్టిండి... ఉండవల్లి సూచన

undavalli arun kumar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక నెలకొనివుందని, దీనికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా మారి స్థానంలో కొత్త అభ్యర్థులకు సీట్లు ఇస్తే గెలుస్తామని అనుకుంటే చేదు ఫలితం ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, 'రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులను మార్చేస్తే తిరిగి అధికారం వస్తుందని సీఎం జగన్‌ భావిస్తే ఫలితం చేదుగా ఉండవచ్చన్నారు. 
 
వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చనిపోయినపుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసుతో వైఎస్ జగన్‌ ఎలా ఫీలయ్యాడో.. ఈ రోజు కూడా సీఎం జగన్ తిరిగి సీటు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు కూడా అలానే ఫీలవుతారన్నారు. ఈ కారణంగా కొన్ని ఓట్లు పోతాయన్నారు. 
 
తెలంగాణలో సిటింగ్‌ ఎమ్మెల్యేల సీట్లు మార్చక కేసీఆర్‌, ఏపీలో సీట్లు మార్చి జగన్‌ ఓడిపోయారనే పరిస్థితిని తెచ్చుకోవద్దని హితవు పలికారు. అసలు ఎమ్మెల్యేలకు ప్రజల్లో పట్టు ఎక్కడ ఉందని ఆయన సూటిగా ప్రశ్నించారు. 'అంతా జగనే కదా.. ఆయన లేకపోతే వలంటీర్లదే పట్టు. వాళ్లనే నిలబెడితే పోతుందేమో' అని ఆయన ఎద్దేవా చేశారు. 
 
టీడీపీ యువనేత లోకేశ్‌ యువగళం పాదయాత్ర బాగా జరిగిందని, జనసేనతో పొత్తు వారి బలాన్ని మరింత పెంచిందన్నారు. 'సీఎం జగన్‌ వస్తుంటే చెట్లన్నీ కొట్టేస్తున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ దయచేసి చెట్లు కొట్టకండి. చీఫ్‌ సెక్రటరీనో, ఎవరో ఒకరు దీన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి, చెట్లు కొట్టవద్దని కోరాలి' అని ఉండవల్లి పేర్కొన్నారు. 
 
చెట్లను కాపాడుకోవడం పర్యావరణానికి అవసరమని, మనం బతకాడానికి పర్యావరణం అవసరమన్నారు. పార్లమెంట్‌ పొగబాంబు ఘటనలో నిందితులకు పాస్‌ ఇచ్చిన ఎంపీని కనీసం ప్రశ్నించకుండా ఎంపీలను సస్పెండ్‌ చేయడం దారుణమని ఉండవల్లి అన్నారు. 'దాడిచేసిన వాళ్లు టెర్రరిస్ట్‌లా, విదేశీ హస్తం ఉందా అనే వివరాలు మొదట ఆరా తీయాలి కదా? అవేమీ పట్టించుకోకుండా.. ప్రశ్నిస్తున్న వారిని సస్పెండ్‌ చేయడమేంటి? ఇంతమందిని సస్పెండ్‌ చేయడం నేనెప్పూడూ చూడలేదు. సమావేశాలు పూర్తయ్యే వరకూ సస్పెండ్‌ చేయడమంటే ఇది నియంతృత్వం వైపు వెళుతున్నట్టే' అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.