ప్రేమించాడనీ చెట్టుకు కట్టేసి సజీవంగా బూడిద చేశారు... ఎక్కడ?
ఆ యువకుడు తన మనస్సుకు నచ్చిన యువతిని ప్రేమించడమే శాపమైంది. తమ బిడ్డను ప్రేమించినందుకు యువతి తల్లిదండ్రులు అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారు. తమ కుమార్తెను ప్రేమించిన యువకుడి ఇంట్లోనుంచి బయటకు లాక్కొచ్చి చెట్టుకు కట్టేసి సజీవదహనం చేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌ఘర్ జిల్లాలో జరిగింది.
సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన అంబికా ప్రసాద్ పటేల్ (22) అనే యువకుడు గత ఏడాది కాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే కొద్ది నెలల క్రితం ఆ యువతి యూపీ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. కాన్పూర్‌లో విధులు నిర్వర్తిస్తోంది. అప్పట్నుంచి ఆమె అతని పట్ల సరియైన ప్రేమ చూపించడం లేదు.
ఈ క్రమంలో కొద్ది వారాల క్రితం ఈ ప్రేమికులిద్దరి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఫోటోలను అంబికా షేర్ చేశాడని.. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.
అయితే, కరోనా వైరస్ కారణంగా యూపీలోని 71 జైళ్లల్లో ఉన్న 11 వేల మంది నిందితులను మే 1వ తేదీన పెరోల్‌పై విడుదల చేశారు. విడుదలైన వారిలో అంబికా కూడా ఉన్నాడు. అయితే గ్రామానికి చేరుకున్న పటేల్‌పై యువతి తల్లిదండ్రులు, వారి బంధువులు కలిసి సోమవారం రాత్రి దాడి చేశారు.
ఇంట్లో ఉన్న అతడిని బయటకు లాక్కొచ్చి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులపై కూడా స్థానికులు దాడి చేశారు. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో యువతి తండ్రితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడి గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు.