టీడీపీలోకి వంగవీటి రాధాకృష్ణ.. లగడపాటి మధ్యవర్తిత్వం
విజయవాడ నగరంలో మంచిపట్టున్న నేతగా గుర్తింపు పొందిన వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మధ్యవర్తిత్వంతో ఆయన సైకిలెక్కేందుకు సిద్ధమయ్యారు. సోమవారం అర్థరాత్రి లగడపాటితో కలిసి వంగవీటి రాధాకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారంతా గంటకు పైగా చర్చలు జరిపారు.
ఈ చర్చలతో సంతృప్తి చెందిన వంగటీవి రాధాకృష్ణ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అదేసమయంలో వంగవీటి రాధాకు మచిలీపట్లం లోక్‌సభ స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
కాగా, వైకాపాకు రాజీనామా చేసిన వంగవీటి రాధా గతకొంతకాలంగా టీడీపీలో చేరవచ్చనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. అయితే, ఆ పార్టీలో చేరాలంటే విజయవాడలో సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న కొండప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని రాధా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ఆయన డిమాండ్‌పై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. కొండ ప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేయించారు. దీంతో తన తండ్రి చివరి కోరికను తీర్చిన పార్టీగా టీడీపీ ఉంది కనుక తాను టీడీపీలో చేరేందుకు సిధ్దమయ్యానని తన కార్యకర్తలకు చెప్పినట్లు తెలిసింది.