సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (19:16 IST)

తెదేపాకి ఇవే ఆఖరి ఎన్నికలు... జోస్యం చెప్పుకొచ్చిన నరసింహారావు...

ఎవరికే వారే గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఎన్నికల నగారా మ్రోగిన వేళ... భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు తెదేపాకి ఇవే చివరి ఎన్నికలంటూ జోస్యం చెప్పడం ప్రారంభించేసారు. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో జీవీఎల్‌ సోమవారం పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. మరో నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ భాజపా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామనీ, సామాజిక ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుందనీ స్పష్టం చేసారు. భాజపా బలోపేతంతోనే జాతీయ భద్రత సాధ్యమవుతుందనీ ఆయన పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు కురిపించారు. డబ్బులు పంచి అందలాలు ఎక్కాలని తెదేపా భావిస్తోందని ఆరోపించిన ఆయన అవినీతిలో ఆ పార్టీకి గోల్డ్‌ మెడల్‌ ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. 
 
భాజపాపై విమర్శలు చేయడం.. తమ మీద పడి ఏడవడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని విమర్శించారు. జనాలు గంట గంటకు తమ ఓటు ఉందో లేదో చెక్‌ చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని చెప్పుకొచ్చారు.