శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (20:46 IST)

‘‘వస్తున్నా మీ కోసం’’ పాదయాత్ర పూర్తయి ఐదేళ్లు... సీఎం చంద్రబాబు స్పీచ్

‘‘వస్తున్నా మీ కోసం’’ పాదయాత్ర పూర్తయి ఐదేళ్లు... ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి విషయాలను ఒకసారి వివరించారు. ఆయన మాటల్లోనే... నా సుదీర్ఘ పాదయాత్ర ‘‘వస్తున్నా మీకోసం’’ ఇదే రోజున ముగిసింది. ఇప్పటికి 5 ఏళ్లు అయ్యింది. విశాఖలో ముగింప

‘‘వస్తున్నా మీ కోసం’’ పాదయాత్ర పూర్తయి ఐదేళ్లు... ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి విషయాలను ఒకసారి వివరించారు. ఆయన మాటల్లోనే... నా సుదీర్ఘ పాదయాత్ర ‘‘వస్తున్నా మీకోసం’’ ఇదే రోజున ముగిసింది. ఇప్పటికి 5 ఏళ్లు అయ్యింది. విశాఖలో ముగింపు సభ జరిగింది. 2012అక్టోబర్ 2న గాంధీ జయంతినాడు పాదయాత్ర ప్రారంభించాం. అనంతపురం జిల్లా హిందూపురంలో తొలి అడుగువేశాను.
 
16 జిల్లాలలో, 86నియోజకవర్గాలు,162మండలాలు, 28పట్టణాలు, 5 నగరాలు, 1,253 గ్రామాలలో 208 రోజులు పాదయాత్ర జరిగింది. 2,817కి.మీ నడిచాను. వేలాది నాయకులు, లక్షలాది కార్యకర్తల సంఘీభావంతో, కోట్లాది ప్రజల ఆశీస్సులతో, భగవంతుని అనుగ్రహంతో, కుటుంబ సభ్యుల సహకారంతో విజయవంతంగా జరిగింది. ఇప్పటి పాదయాత్రలకు, ఆ పాదయాత్రకు పోలికే లేదు. ఇప్పుడు ఒకాయన చేసేది పాదయాత్ర కాదు, బాధయాత్ర. 4 రోజులకోసారి బ్రేకప్‌ల యాత్ర. అది వేరు, ఇది వేరు. రెండింటినీ ఒకగాట కట్టరాదు.
 
‘‘వస్తున్నా..మీకోసం’’ పాదయాత్ర నా జీవితంలో మరిచిపోలేని అనుభవం. నాలో మరో వ్యక్తిని తట్టిలేపిన సందర్భం. 40 ఏళ్ల నా రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తే ‘‘పాదయాత్రకు ముందు-పాదయాత్ర తరువాత చంద్రబాబు’’ అనేది రెండుభాగాలుగా చూడాల్సివుంది. మొన్ననే నా రాజకీయ ప్రస్థానం 40 వసంతాలు జరిగింది. నా పాదయాత్ర ముగింపు 5 వసంతాలు కూడా ఇదే సంవత్సరంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నా పాదయాత్రలోని ప్రధాన ఘట్టాలను మరోసారి గుర్తు చేసుకుందాం. యాత్రను విజయవంతం చేసిన అందరినీ గుర్తు చేసుకుందాం.
 
పాదయాత్రలో ఏ వాగ్దానాలు చేశాను, ఎన్ని నెరవేర్చాను, ఇంకా చేయాల్సినవి ఏమిటి? ఈ నాలుగేళ్లలో ఏం సాధించాం..? అనేది విశ్లేషించుకుందాం. ప్రజలను చైతన్యపరుద్దాం. పేదల సేవకు పునరంకితం అవుదాం. పునాదుల నుంచి కొత్త రాష్ట్రం నిర్మాణంలో భాగస్వాములు అవుదాం.
 
పాదయాత్ర నేపథ్యం: వస్తున్నా మీకోసం పాదయాత్ర 2012అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభించాం. గాంధీజి, అంబేద్కర్, ఎన్టీఆర్,జ్యోతిరావు పూలే,అల్లూరి సీతారామరాజు మహనీయులకు నివాళులు అర్పించి పాదయాత్ర చేపట్టాం. తీవ్ర దుర్భిక్షం, కరవు పరిస్థితులు, పవర్ కట్స్, పవర్ హాలిడేస్, క్రాప్ హాలిడేస్, మిల్క్ ప్రొక్యూర్ మెంట్ హాలిడేస్.. పదేళ్లలో 24వేల మంది రైతు ఆత్మహత్యలు(వైఎస్ హయాంలోనే 14,079మంది రైతుల ఆత్మహత్య), ప్రతి అరగంటకు ఒకరు చొప్పున రోజుకు 48 మంది రైతులు పిట్టల్లా రాలిపోవడం, రాత్రిపూట కరెంట్ సరఫరా వల్ల విద్యుత్ షాక్‌కు, పాముకాట్లకు బలై 4 వేల మంది రైతులు చనిపోవడం... నా మనసును కదిలించి వేశాయి.
 
నెలకు 15 రోజులు పరిశ్రమల లాకౌట్ మూతపడిన లక్షలాది యూనిట్లు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ లక్షలాది కార్మికులు, అప్పుల పాలై చివరికి పారిశ్రామికవేత్తలు ఆత్మహత్యలు చేసుకోవడం.. మైక్రో ఫైనాన్స్ అధికవడ్డీ కోరలకు బలై 200 మంది మహిళల ఆత్మహత్యలు, నైరాశ్యంలో విద్యార్ధులు, నిరుద్యోగం పెరిగిపోవడం, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం వలన నైరాశ్యంలో మునిగారు.
 
ఎక్కడ చూసినా భూకబ్జాలు,లక్షలాది ఎకరాలు సెజ్‌ల పేరుతో లాక్కోవడం, అరాచక శక్తుల స్వైర విహారం, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, అందరూ కలిసి పొలిటికల్ మాఫియాగా రూపొందడం... ఇవీ అప్పటి దుర్భర పరిస్థితులు.. అశాంతి, అభద్రత, అలజడులు, ఆందోళనలతో రాష్ట్రం అంతా అట్టుడికిపోయింది. ఈ పరిస్థితులను చూడలేక, ప్రజల్లో భరోసా నింపేందుకు, వారికి ధైర్యం కలిగించి, భవిష్యత్ వైపు నడిపించేందుకు ఆ రోజు పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. ప్రజల దుర్భర  పరిస్థితులను స్వయంగా నా కళ్లతో చూశాను.
 
రైతులు, మహిళలు, కార్మికులు, చేనేత, కల్లుగీత కార్మికులు, బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటిలు అన్ని వర్గాలవారితో మమేకం అయ్యాను. వారి సమస్యలు విచారించాను. డాక్యుమెంటేషన్ కమిటి ఈ మొత్తం బాధ్యత భుజాన వేసుకుంది. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు 4,880 వినతులు అందజేశారు. వీటిపై అప్పటికప్పుడు స్పందించి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు 1,522 లేఖలు రాశాను. 1,244మందికి ఆర్ధికసాయం అందించాం.
 
సమస్యల తీవ్రతపై అప్పటికప్పుడు స్పందించి కొన్ని హామీలు ప్రకటించాను. తద్వారా ఆయా వర్గాలలో భరోసా నింపే ప్రయత్నం చేశాను. ఆత్మవిశ్వాసం పెంచాను.
 
పాదయాత్ర ముగియగానే ఇచ్చిన అన్ని హామీలను క్రోడీకరించి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచాం. దాదాపు 227 హామీలు ఇచ్చాం మేనిఫెస్టోలో. ఈ నాలుగేళ్లలో వాటిలో 98% నెరవేర్చడం జరిగింది. ఇంకా రెండో మూడో హామీలు మాత్రమే నెరవేర్చాల్సి వుంది. వాటిని ఈ ఏడాది పూర్తిచేస్తాం. 100% హామీలు నెరవేర్చడం సంతోషంగా ఉంది. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేసి చూపించడంపై ప్రజల్లో సంతృప్తి ఉంది.