ఏపీలో పెరిగిన విజయ పాల ధర... అర లీటరు ప్యాకెట్‌పై రూపాయి పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రముఖ పాల బ్రాండ్లలో ఒకటైన విజయ పాల ధరను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అర లీటరు పాల ప్యాకెట్‌తో సహా ఆరు రకాల ప్యాకెట్ ధరలను రూపాయి చొప్పున పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం తీసుకుంది.
తాజాగా చేసిన పెంపుతో అర లీటరు లో ఫ్యాట్ ధర రూ.27, ఎకానమీ ధర రూ.29, ప్రీమియం ధర రూ.31, స్పెషల్ రూ.36, గోల్డ్ రూ.37, టీ మేట్ ధర రూ.34 చొప్పున పెరిగినట్టు కృష్ణ మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొన్ని ఈశ్వర బాబు తెలిపారు.
చిన్న పాల ప్యాకెట్లు, పెరుగు, ఇతర పాల పదార్థాల ధరల్లో ఎలాంటి మార్పులు లేవని యూనియన్ తెలిపింది. అలాగే, నెలవారీ పాలకార్డు దారులకు మాత్రం వచ్చే నెల 9వ తేదీ వరకు పాత ధరలే వర్తిస్తాయని, 10వ తేదీ నుంచి వీటి ధరలు పెరుగుతాయని వెల్లడించింది.
పాల సేకరణ ధరలు పెరగడం, నిర్వహణ, రవాణా ఖర్చులు అధికం కావడంతోనే ధర పెంచాల్సి వచ్చిందని, పెరిగిన ధర మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని డైరెక్టర్ వెల్లడించారు.