మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (14:36 IST)

విజయవాడ మెట్రో రైలు కల సాకారానికి తొలి అడుగు

hyderabad metro
విజయవాడ నగర వాసుల మెట్రో కల త్వరలోనే సాకారంకానుంది. గన్నవరం, పెనమలూరు నుంచి రెండు కారిడార్లుగా ఈ మెట్రో రైల్ నిర్మించాలని భావిస్తున్నారు. విజయవాడలోని పీఎన్‌బీఎస్ వద్ద ఈ రెండు కారిడార్లు కలిసేలా నిర్మించనున్నారు. తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు, రెండో కారిడార్ పొడవు 12.5 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు. ఇందుకోసం మొత్తం 91 ఎకరాల స్థలం అవసరం కావాల్సి ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏపీఎంఆర్‌సీకి ప్రతిపాదనలు పంపించింది. 
 
తొలి కారిడార్‌ పీఎన్బీఎస్ నుంచి ప్రారంభమై విజయవాడ రైల్వే  స్టేషన్‌ను కలుపుతూ ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపైకి వచ్చి, అక్కడ నుంచి గన్నవరానికి వెళుతుంది. ఈ క్రమంలో యోగాశ్రమం, విమానాశ్రయం, గూడవల్లి, చైతన్య కాలేజీ, నిడమానూరు, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామవరప్పాడు చౌరస్తాల మీదుగా వెళుతుంది. ఆ తర్వాత ఏలూరు రోడ్డులోకి వంపు తిరిగి గుణదల, పడవల రేవు, మాచవరం డౌన్, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్ రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా పీఎన్‌బీఎస్‌కు రైలు చేరుకుంటుంది. 
 
అలాగే, 12.5 కిలోమీటర్ల మేరకు ఉండే రెండో కారిడార్‌ పీఎన్బీఎస్ నుంచి ప్రారంభమై బందరు రోడ్డు మీదుగా బెంజి సర్కిల్, ఆటో నగర్, కానూరు, పోరంకి మీదుగా పెనమలూరు వరకు వెళుతుంది. ఈ క్రమంలో పీఎన్బీఎస్, బందరు రోడ్డులో విక్టోరియా మ్యూజియం, ఇందిరా గాంధీ స్టేడియం, బెంజి సర్కిల్, ఆటో నగర్, అశోక నగర్, కృష్ణానగర్, కానూరు సెంటర్, తాడిగడప, పోరంకి మీదుగా పెనమలూరుకు చేరుకుంటుంది.