1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 30 జులై 2022 (21:30 IST)

విజయవాడ ట్రాఫిక్ బాబోయ్, మంత్రి నాగార్జున కారు ప్రమాదం

Traffic
ట్రాఫిక్ నిబంధనల అనుసరించే విషయంలో విజయవాడ వరస్ట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వాహనదారులు ఎంతమాత్రం నిబంధనలు పట్టించుకున్న పాపానపోవడంలేదు. వన్ వే అని తెలిసినా వాహనాలతో ఎదురుగా వస్తుంటారు. ముందు వాహనం ఓ మోస్తరు వేగంతో వెళ్తుంటే వెనుక నుంచి జెట్ స్పీడుతో వచ్చి... వారి వెనకాలే హారన్లు మోగిస్తూ తీవ్ర అసౌకర్యం కలిగిస్తారు. దీనితో నిదానంగా వెళ్లేవారు సైతం వాయువేగంతో వెళ్లాల్సిన దుస్థితి.

 
రెడ్ లైట్లను పట్టించుకోరు. కాస్త సందు దొరికినా ఇరుక్కుని పోతుంటారు. వారిని వారించేందుకు అక్కడ పోలీసు సిబ్బంది వుండరు. రోడ్లపై ఎవరు ఎటు నుంచి వస్తారో జడుసుకు చస్తూ వాహనం నడపాల్సిన పరిస్థితి. విజయవాడ నగర రోడ్లపై వాహనం నడపడమంటే యముడితో ఆటలాడుకోవడం లాంటిదని ఓ ద్విచక్రవాహనం నడిపే వ్యక్తి వ్యాఖ్యానించడాన్ని చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

 
ఏ వాహనం నడిపేవారిదైనా ఒకటే మైండ్ సెట్. విపరీతమైన స్పీడుతో నడపడం వారికి వారే సాటి. బ్రేకులు పనిచేయకపోతే అవతలివారికో ఇవతలవారికో ప్రమాదం తప్పదు. తాజాగా ఏపీ మంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. వారధి నుంచి బందర్ రోడ్డువైపు వెళ్తుండగా... ఎప్పటిలాగే ఆటో సడన్ బ్రేక్ వేసారట. దాంతో మంత్రి కారు ఆటోకి ఢీకొట్టింది. వెనుక వున్న మంత్రిగారి కాన్వాయ్ మంత్రి ప్రయాణిస్తున్న కారుకి డ్యాష్ ఇచ్చాయి. దీనితో కారులో వున్న మంత్రిగారి కుమారుడికి గాయాలయ్యాయి. సమీపంలో వున్న ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు.

 
ఐతే... విజయవాడ నగరం రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను నడిపేవారికి పగ్గాలు ఎలా వేయాలో అధికారులు ఓసారి తీవ్రంగా ఆలోచన చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.