గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (22:36 IST)

ఐటీ కేంద్రంగా విశాఖ...

యువతకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ముఖ్య ఉద్దేశమని ఏపీ సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్‌(ఈఎంసీ), డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ బుధ‌వారం సమీక్ష నిర్వ‌హించారు.

స‌మీక్ష‌కు పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, వైఎస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌  క్లస్టర్స్‌(ఈఎంసీ) సీఈఓ ఎం నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ... పిల్లలకు అత్యున్నత నైపుణ్యాలు నేర్పించాలని ఆదేశించారు. నైపుణ్యాలతో ప్రపంచ స్థాయిలో పోటీపడే పరిస్థితి వస్తుందన్నారు. ఉద్యోగాల కల్పనకు విశాఖ ప్రధాన కేంద్రమవుతుందన్నారు. భవిష్యత్‌లో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుందని తెలిపారు.

నాణ్యమైన విద్యకు విశాఖను కేంద్రంగా చేయాలని ఆదేశించారు. ఐటీ రంగంలో అత్యుత్తమ వర్సిటీని విశాఖలో తీసుకురావాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలకు ఏటా ప్రోత్సాహకాలు ఉంటాయని సీఎం వెల్లడించారు. కనీసం ఒక ఏడాది పాటు ఉద్యోగి అదే కంపెనీలో పని చేయాలన్నారు.

వర్క్‌ ఫ్రం హోం కార్యాచరణ బలోపేతానికి చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలకు మంచి సామర్థ్యమున్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం వెల్లడించారు. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్కడి నుంచే పనిచేసుకునే సదుపాయం ఉంటుందన్నారు.

డిసెంబరు కల్లా సుమారు నాలుగువేల గ్రామాలకు ఇంటర్‌నెట్‌ కనెక్టవిటీ ఇచ్చేలా అధికారులు ముందడుగు వేస్తున్నారని సీఎం స్పష్టం చేశారు.

అన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్దేశించారు.