నేటి నుంచి వసంత మండపంలో విష్ణుపూజలు
కరోనా నేపథ్యంలో లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో నవంబరు 19 నుంచి డిసెంబరు 13వ తేదీ వరకు తిరుమల వసంత మండపంలో శ్రీమహావిష్ణువుకు సంబంధించిన అనేక విశేష ఆరాధనలు వైఖానసాగమబద్ధంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అర్చకులు బుధవారం వసంత మండపంలో పరిశీలించారు.
నవంబరు 19న గురువారం విష్ణుసాలగ్రామ పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. నవంబరు 19, 22, 24 నుండి 28వ తేదీ వరకు, డిసెంబరు 1, 2, 5వ తేదీల్లో, ఆ తరువాత డిసెంబరు 10 నుండి 13వ తేదీ వరకు విష్ణుపూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నవంబరు 22న గోపాష్టమి(గోపూజ), నవంబరు 24న అశ్వత్థ(రూప విష్ణు) పూజ, సార్వభౌమ వ్రతం, నవంబరు 25న ప్రబోధనైకాదశి - శ్రీరమా సమేత విష్ణుపూజనం, నవంబరు 26న క్షీరాబ్ధిద్వాదశి, కైశికద్వాదశి - శ్రీ తులసీ ధాత్రీ సహిత దామోదర వ్రతం, నవంబరు 27, డిసెంబరు 11వ తేదీల్లో శ్రీ రాధా దామోదర పూజ, నవంబరు 28న వైకుంఠ చతుర్దశీ వ్రతం కమలములతో శివకేశవ పూజ నిర్వహిస్తారు.
అదేవిధంగా డిసెంబరు 1న ధాత్రీ విష్ణు పూజ, డిసెంబరు 2న అచ్యుతార్చన, గోపూజ, డిసెంబరు 5, 10వ తేదీల్లో విష్ణు సాలగ్రామ పూజ, డిసెంబరు 12న తులసీవిష్ణు సమారాధనం, డిసెంబరు 13న శ్రీ ధన్వంతరీ జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.