శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 13 ఆగస్టు 2021 (19:11 IST)

వివేకా హ‌త్య కేసు... క్రైమ్ థ్రిల్లర్ సినిమాలా ఉంది: జ‌వ‌హ‌ర్

ముఖ్యమంత్రి సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ పేరుతో చిట్టెలుకలపై బ్రహ్మస్త్రాలు ప్రయోగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన తననివాసంనుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.

గొడ్డలి దెబ్బలను గుండెపోటుగా చిత్రీకరించాలని విజయసాయిరెడ్డి, వై.ఎస్. అవినాష్ రెడ్డిలు ఎందుకు ప్రయత్నించారని, అసలు గొడ్డలి దెబ్బలకు, గుండె పోటుకి ఉన్నసంబంధమేంటనే దిశగా సీబీఐ అధికారులు ఎందుకు విచారణ జరపడంలేదని జవహర్ ప్రశ్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి బాబాయి చంపబడితే, ఇంత వరకు నిందితులెవరో పట్టుకోలేకపోయారనే దానిపై దేశమంతా చర్చ జరుగుతోందన్నారు.

వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇచ్చిన జాబితాలోని 15 మంది అనుమానితులను కూడా విచారించలేదన్నారు. వివేకానందరెడ్డి లాంటి సింహాన్ని సునీల్ యాదవ్ లాంటి చిట్టెలుక ఎలా చంపుతుందని, స్వయంగా సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులే వాపోతున్నారని, వారు చెప్పిన సింహాలు ఎవరనే దిశగా సీబీఐ ముందుకెళ్లడం లేదన్నారు. వివేకా హత్యకేసులో విజయ సాయి రెడ్డి పాత్రను అనుమానించాల్సిందేనని జవహర్ తేల్చిచెప్పారు.

వివేకానందరెడ్డి చంపబడిన రోజు రాత్రి ఎవరెవరితో మాట్లాడారనే దానిపై కూడా దృష్టిపెట్టాలన్నారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి, సానుభూతికోసం వివేకానందరెడ్డిని చంపారా? లేక ఎన్నికల్లో లబ్ధిపొందడానికి చంపారా? ఇందులో జగన్మోహన్ రెడ్డి కుట్రపూరిత ప్రమేయం ఎంతుందో తేలాలన్నారు.

వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇంటి పక్కన రెక్కీ నిర్వహించిన వ్యక్తి ఎవరు? అతన్ని గతంలో తాను వేరేవ్యక్తికి సంబంధించిన ప్లెక్సీలో చూశానని ఆమె చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. బాబాయి కూతురు, సొంత చెల్లెలకే రక్షణకల్పించ లేని ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఆడబిడ్డలను రక్షిస్తాడంటే ప్రజలెలా నమ్ముతారన్నారు. గతంలోకూడా జగన్మోహన్ రెడ్డి తొలుత సీబీఐ విచారణ జరిపించాలని, కోర్టులో పిటిషన్ వేసి, తరువాత దాన్ని ఆయనే ఉపసంహరించుకున్నాడని, అదంతా చూస్తుంటే, వివేకాహత్యకేసులో జగన్ కుట్ర కోణం కూడా దాగి ఉందేమోననే తమకు అనిపిస్తోందన్నారు.

వివేకా హత్యజరిగినప్పుడు సాక్షి పత్రికలో నారా సుర చరిత్ర అని తప్పుడు కథనాలు రాయించారని, కానీ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రక్త చరిత్ర మొదలైందే వై.ఎస్ కుటుంబం నుంచని జవహర్ మండిపడ్డారు. రాజారెడ్డి హ‌యాంలో గనుల యజమానులు హత్యలు, మొద్దుశీనుహత్య, పరిటా ల రవిహత్య, హైదరాబాద్ లో జరిగిన అల్లర్లు, ముదిగొండలో అమాయకులను పొట్టనపెట్టుకున్న ఘటలన్నీ తమవాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయన్నారు. హత్యగురించి తప్పుడు కథనాలు రాసిన సాక్షిపత్రికవారినికూడా సీబీఐ విచారించాలన్నారు.

ప్రధాన సూత్రధారులైన విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డిలను సీబీఐ తక్షణమే విచారించాలని, అవసరమైతే వారికి లైడిటెక్టర్ పరీక్షకూడా చేయాలని జవహర్ డిమాండ్ చేశారు. వివేకాహత్య అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసిందెవరు.. ఎవరి ప్రమేయంతో వారు ఆపనిచేశారనే దానిపై లోతైన విచారణ జరగాలన్నారు. అసలు దోషులు ఎంతటివారైనా, వారిని విచారణకు పిలవాల్సిన బాధ్యత సీబీఐ దేనని జవహర్ తేల్చి చెప్పారు.

తన తండ్రి హత్య కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే దేవిరెడ్డి, మణికంఠారెడ్డి అనేవారు తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించినట్లు వివేకా కుమార్తె సునీత చెబుతోందని, ఆమెకు తగిన భద్రతక ల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.