ఆ వైద్యుడు పట్ల పోలీసులు ఎంతో సౌమ్యంగా వ్యవహరించారు : విశాఖ సీపీ
వైజాగ్‌లో జాతీయ రహదారిపై డాక్టర్ సుధాకర్ వ్యవహరించిన తీరుతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అయితే, వైద్యుడిని అరెస్టు చేసే సమయంలో పోలీసులు వ్యవహారశైలి వివాదాస్పదమైంది.
డాక్టర్ సుధాకర్ వంటిపై చొక్కాలేని స్థితిలో, పోలీసులు చుట్టుముట్టి ఉండగా, చేతులు వెనక్కి విరిచి కట్టేసిన స్థితిలో కనిపించారు. దీనిపై అప్పుడే వివరణ ఇచ్చిన విశాఖపట్టణం పోలీస్ కమిషనరు ఆర్కే మీనా మరోసారి మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఘటనాస్థలిలో ఓ పౌరుడితో వైద్యుడు దురుసుగా ప్రవర్తించినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆయనెవరో కూడా తెలియదని, గతంలో జరిగిన సంఘటనలకు ఈ వ్యవహారానికి అస్సలు సంబంధం లేదని వెల్లడించారు.
పైగా, ఆ సమయంలో వైద్యుడు మద్యం సేవించివున్నట్టు పోలీసులు గుర్తించారని తెలిపారు. ఆ డాక్టరును ఇంటికి పంపించేందుకు పోలీసులు యత్నించారని, వీడియోలో చూస్తే ఆ డాక్టర్ ప్రవర్తన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు.
తమ సిబ్బంది ఎంతో ఓపికతో వ్యవహరించారని వివరించారు. డాక్టర్ సుధాకర్‌ను కేజీహెచ్‌కు తరలించామని చెప్పారు. కాగా, డాక్టర్ సుధాకర్‌ను గతంలో మాస్కు అడిగినందుకు సస్పెండ్ చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై రాజకీయంగానూ దుమారం రేగిన విషయం తెల్సిందే.