శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మే 2020 (10:49 IST)

అమిత్ షాకు కేన్సర్ అంటూ వదంతులు సృష్టించిన నలుగురి అరెస్టు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనీ, ఆయనకు కేన్సర్ సోకినట్టు సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేశారు. ఈ వందంతులను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం హోంశాఖ వర్గాలు తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినందుకుగాను నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
మరోవైపు, ఈ వదంతులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, తాను ఎలాంటి జబ్బుతో బాధపడడంలేదని తేల్చిచెప్పారు. 
 
కేంద్ర మంత్రిగా తన విధులను సంపూర్ణ అంకితభావంతో నిర్వర్తిస్తున్నానని తెలిపారు. దేశం కరోనా వైరస్‌తో తల్లడిల్లుతున్న వేళ తాను విధి నిర్వహణలో తలమునకలుగా ఉన్నానని, ఇలాంటి రూమర్లను పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. 
 
పుకార్లు విషయం తనకు తెలిసినా, సదరు వ్యక్తుల వికృత మనస్తత్వానికే ఆ విషయం వదిలేశానని, అందుకే మొదట్లో స్పందించలేదని తెలిపారు. అయితే, లక్షలమంది పార్టీ కార్యకర్తలు బాధపడుతుండటంతో స్పందించక తప్పలేదని అమిత్ షా వివరణ ఇచ్చారు.