రాజులే లేనపుడు రాజద్రోహం కేసు నమోదా? : లక్ష్మీనారాయణ ప్రశ్న
మన దేశంలో రాజులే లేనపుడు రాజద్రోహం అభియోగం ఎలా అమలవుతుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. అందువల్ల ప్రజాస్వామ్య భారతావనిలో నేటికీ రాజద్రోహం నేరాభియోగం అమలు చేయడం తగదని ఆ విధానం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జేడీ(జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్) సంస్థ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతతో నిర్వహించిన చర్చాగోష్ఠిలో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాజులే లేనప్పుడు రాజద్రోహ అభియోగం ఎలా అమలవుతుందని ప్రశ్నించారు. న్యాయమూర్తులూ ఇదే అభిప్రాయం వెలిబుస్తున్నారన్నారు.
'ప్రభుత్వం నూతన ఆర్థిక వనరులు సృష్టించాలే తప్ప... ప్రజలపై పన్నుల రూపంలో భారం మోపడం తగదు. ఇంధన విక్రయాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్ రూ.65, డీజిల్ రూ.45కే లభ్యమయ్యే అవకాశం ఉంది. మితిమీరిన సుంకాలను ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తే పాలకులే తోకముడుస్తారు.
ఇందుకు బ్రిటిష్ హయాంలో చీరాల, పేరాల ఉద్యమమే ఉదాహరణ. రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించడం ద్వారా ప్రజారోగ్య ప్రమాణాలు పెంచిన వారవుతారు' అని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.