గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 16 అక్టోబరు 2021 (18:37 IST)

తిరుపతి, తిరుమలలో భారీ వర్షం, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

తిరుమల సాధారణ స్థితికి చేరుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు యధేచ్ఛగా తిరిగేస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆన్ లైన్లో దర్సన టిక్కెట్లను బుక్ చేసుకున్న భక్తులందరూ తిరుపతికి వచ్చేస్తున్నారు. 
 
తిరుమలలో భక్తుల రద్దీఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తిరుపతి, తిరుమలలో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా తిరుపతి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తిరుమలలో అయితే భక్తుల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతోంది. దర్సనం తరువాత కాటేజీలకు వెళ్ళేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా తిరుమలలో వర్షం పడుతుండటంతో భక్తులు తడిచి ముద్దవుతున్నారు. 
 
తిరుపతి, తిరుమలలో కురిసిన వర్షానికి వాగులు, వంగలు పొంగి పొర్లుతున్నాయి. మురికి నీళ్ళు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. చిన్న కాలువలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. మాల్వాడి గుండం నిండిపోయింది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి నీళ్ళు కిందకు జాలువారుతున్నాయి.
 
కపిలతీర్థంలోకి వర్షపునీరు వచ్చి పడుతుండడంతో స్థానికులు ఎంతగానో ఆసక్తిగా తిలకిస్తున్నారు. అలాగే తిరుమల దర్సనార్థం వచ్చే భక్తులు కూడా కపిలతీర్థం మాల్వాడి గుండాన్ని తిలకిస్తున్నారు. అయితే వర్షం కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే రహదారి, అలాగే తిరుమల నుంచి తిరుపతికి వచ్చే రహదారి పూర్తిగా ట్రాఫిక్ మయమైంది. వాహనదారులు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలను ఘాట్ రోడ్డులో పక్కకు నిలిపివేయడంతో మరో వాహనం వెళ్ళలేక ట్రాఫిక్ స్థంభించింది.