శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 జులై 2021 (12:41 IST)

సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్ళు - నీట మునిగిన ఆలయం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం, కొత్తపల్లి మండలంలో వెలసిన సప్త నదుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. సంగమతీరం సంద్రాన్ని తలపిస్తోంది. 
 
గతవారం రోజులుగా వరద పోటెత్తడంతో సంగమేశ్వరం వద్ద ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. సంగమేశ్వరం జల వారధి కావడంతో ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ బుధవారం ఉదయం అంత్య పూజలు నిర్వహించారు. 
 
ఇక వరద జలాలు ఆలయంలోకి చేరుకోవడంతో సప్త నదుల సంగమేశ్వరుడిని గంగమ్మ తాకి పరశించిపోతోంది. దీంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం కనులవిందు చేస్తోంది. మరోవైపు పతిని తాకిని గంగమ్మ పరవశం పొందుతోంది. 
 
ఈ సతీపతుల సంగమానికి ఆలయ పురోహితుడు వేపదార శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అపురూపమైన అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు.