తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల డ్రామా భలే రంజుగా ఉంది : కె.నారాయణ
గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న కృష్ణా జలాల డ్రామా భలే రంజుగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏ సమస్య వచ్చినా దానిని కృష్ణా జలాలతో ముడిపెడుతున్నారని విమర్శించారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఎవరికి వారే ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలని, తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
కృష్ణా జలాల వినియోగంపై ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ట్రైబ్యునల్‌ను కేసీఆర్ ప్రశ్నిస్తే.. జగన్‌మోహన్ రెడ్డి కోర్టులు, ఎన్నికల కమిషన్లను ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల సరిహద్దుల వద్ద పోలీసుల మోహరింపును చూస్తుంటే భారత్ - చైనా దేశాల సరిహద్దులు గుర్తొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు ఇరు రాష్ట్రాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.