ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జులై 2020 (16:06 IST)

రిటైర్డ్ మిలిటరీ అధికారి భార్య అంత్యక్రియలు అడ్డుకున్న స్థానికులు .. ఎందుకు?

అతని కుటుంబం దేశ సేవకు అంకింతమైంది. తండ్రి రిటైర్డ్ మిలిటరీ అధికారి. ఆయన కుమారుడి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. పైగా, రిటైర్డ్ మిలిటరీ అధికారి కొన్నేళ్ళపాటు దేశానికి సేవ చేశారు. అలాంటి అధికారి భార్య కరోనా వైరస్ సోకి చనిపోయింది. ఆమె అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ అధికారి తీవ్ర ఆవేదనతో కుంగిపోయారు. 
 
నిజానికి దేశాన్ని కాపాడుతున్న సైనికులకు యావత్ ప్రజానీకం ఇచ్చే గౌరవం అంతాఇంతా కాదు. కానీ, కరోనా రక్కసి పుణ్యమా అని అన్నీ తలకిందులు అవుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు దేశానికి సేవ చేసిన తనకు... ఇంత వ్యథ అవసరమా అని ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్టే గోదావరి జిల్లా ఏలూరులోని విద్యానగర్‌లో ఓ రిటైర్డ్ సైనికాధికారి తన భార్యతో కలిసి ఉంటున్నారు. ఈయన భార్యకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. 
 
అయితే, ఏలూరు తంగెళ్లమూడి సమాధుల తోటలో అంత్యక్రియల కోసం ప్రొక్లెయిన్‌తో అధికారులు గొయ్యి తీయించారు. ఒక ప్రత్యేక వాహనంలో ఆమె మృత దేహాన్ని శ్మశానవాటికకు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులందరూ అక్కడకు చేరుకున్నారు.
 
ఈ విషయం స్థానికులకు తెలిసింది. అంతే.. ఒక్కసారిగా అక్కడకు చేరుకున్న స్థానికులు.. శవాన్ని అక్కడ పూడ్చవద్దంటూ నిరసనకు దిగారు. వారి వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి కార్యక్రమాన్ని ముగించారు. 
 
కానీ, జరిగిన పరిణామాలతో రిటైర్డ్ మిలిటరీ అధికారి చలించిపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నో సంవత్సరాల పాటు దేశానికి సేవ చేసిన తనకు చివరకు మిగిలిన బహుమానం ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు ప్రస్తుతం భారత వాయుసేనలో పని చేస్తున్నాడని గుర్తుచేశారు.