బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (18:34 IST)

టిటిడిలో ఏం జరుగుతోంది?

తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. టిటిడి ఈవో అశోక్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయారని విమర్శలు వస్తున్నాయి.

ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలు ఒక మాట మీద ఉంటారని (వారిద్దరి మధ్య విభేదాలున్నప్పటికీ) అందుకు కారణం ఈవో సింఘాల్‌ అధికారాలను కుదించటమే కారణమని స్పష్టమవుతోంది అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు ఎందరు ఉన్నా ఏ ఒక్కరూ అక్కడ జరుగుతోన్న అవకతవకలపై బ్రేక్‌ దర్శనాలు, సేవా టిక్కెట్ల దర్శనాల టిక్కెట్లు బ్లాక్‌లో లభించటానికి ముఖ్య కారకులు ఎవరో తెలిసి కూడా మౌనం వహిస్తున్నారట.

బోర్డు సభ్యులకు కావాలిసింది శ్రీవారి టిక్కెట్లే తప్ప అక్కడ జరుగుతున్న పాలన గురించి పట్టించుకోరట. మా ఇన్నేళ్ల సర్వీసులో ఇంత దారుణమైన పరిస్థితిని ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదంటున్నారు క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు. ఛైర్మన్‌ సుబ్బారెడ్డి పేరుతో ఆయన కార్యాలయ సిబ్బంది వేలాది టిక్కెట్లును సిఫార్సు చేస్తున్నప్పటికీ, ధర్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎలాంటి మార్పులు జరగలేదు.
 
ఒకప్పుడు ఐదేళ్ల పాటు తిరుమల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన ధర్మారెడ్డి తాజాగా జేఈవోగా నియమితులై ఆ పదవిని అదనపు ఈవోగా మార్పించి నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మంత్రులు, ఐఎఎస్‌ అధికారులకు అందుబాటులో ఉండటం లేదని, ఈ విషయంలో ధర్మారెడ్డి అహంకారంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఒకప్పటి ప్రత్యేక అధికారి ధర్మారెడ్డికి తాజా అదనపు ఈవో ధర్మారెడ్డికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తుందంటున్నారు అధికారులు, ఉద్యోగులు. దేవాదాయశాఖ మంత్రిని ఖాతరు చేయరు. దేవాదాయ శాఖాధిపతికి కనీస మర్యాద ఇస్తారా…? లేదా…? అన్న విషయం బయట పడటం లేదు. ఆ శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహించి రిటైర్డు అయిన మన్మోహన్‌సింగ్‌కు కనీస మర్యాద ఇచ్చే వారు కాదట.

దీనిని బట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఆయన కార్యాలయ సిబ్బంది, అదనపు ఈవో ధర్మారెడ్డి మాత్రమే అధికారం చెలాయిస్తున్నారని స్పష్టమవుతోంది అంటున్నారు. తమకు కావాలసిన వారికి బ్రేక్‌ మరియు సేవా టిక్కెట్ల దర్శనాలు టిక్కెట్లను ఇప్పిస్తున్నారు. ఆయా టిక్కెట్ల కేటాయింపులో భారీ ఎత్తున గోల్‌‌మాల్‌ జరుగుతుందని, బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని టిటిడి అధికారులు, ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.

ధర్మారెడ్డికి నిజాయితీపరుడైన అధికారిగా పేరు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరుతో గతంలో ఆయనకున్న పేరు ప్రతిష్టలు కోల్పోయారు. టిటిడి ఈవోకున్న అధికారాలను కుదించేందుకు రంగం సిద్దమైందని, బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిని అధికార పెత్తనం ఇంకెన్నాళ్లు జరుగుతుందో, ఆ ఇద్దరినీ ఇంకెన్ని రోజులు భరించాలో? ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రికి తెలియదని, మంత్రులకు తెలిసినా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారని, నిలదీయాల్సిన బోర్డు సభ్యులు సేవా, బ్రేక్‌ టిక్కెట్ల కోటాలపై దృస్టిసారిస్తున్నారే తప్ప అక్కడ జరుగుతున్న అవకతవకలను పట్టించుకోవటం లేదనే వాదన వినిపిస్తోంది.