శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (08:09 IST)

పీపీఏలను ఎందుకు రద్దు చేశామంటే...?: జగన్

ఆంధ్రప్రదేశ్‌కు 975 కిలోమీటర్ల విస్తారమైన సముద్ర తీరం ఉందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ గేట్‌వే హోటల్‌లో భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న డిప్లొమాటిక్ ఔట్ రీచ్ సదస్సుకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
 
 అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ఏపీలో నాలుగు ఓడరేవులు ఉన్నాయని.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆపారమైన అవకాశాలున్నాయన్నారు. తమ రాష్ట్రంలో సుస్ధిరమైన ప్రభుత్వం ఉందని.. మాకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నారని జగన్ తెలిపారు.
 
తమది పేద రాష్ట్రమేనని.. హైదరాబాద్ లాంటి నగరం తమకు లేదని కానీ తమకు బలముందన్నారు. పారదర్శక పాలనతో ముందుకెళ్తున్నామని.. టెండర్ల ప్రక్రియ నుంచి కేటాయింపుల దాకా అవినీతిరహిత నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
 
ఈ 60 రోజుల పాలనలో ఎన్నో మార్పులు చేసి చూపించామని.. విప్లవాత్మక నిర్ణయాలతో పాలనలో ఎంతో మార్పు తీసుకొచ్చామని సీఎం గుర్తు చేశారు. నిజాయితీ, అంకితభావం, నిబద్ధతతో నడుచుకుంటున్నామని.. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను సమీక్షించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
 
ఇది వివాదస్పదమని కొందరు విమర్శించారని.. అయితే ఎక్కువ ధరకు ఎందుకు కరెంట్ కొనాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చే సరికి 20 వేల కోట్ల పెండింగ్ బిల్లులున్నాయని.. ఇవే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో ఎలా ముందుకెళ్లగలమని ఆయన వ్యాఖ్యానించారు.
 
రెండు నెలల క్రితం సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు.. పవర్ డిస్కంల పరిస్ధితి దారుణంగా ఉందన్నారు. రెవెన్యూ తక్కువగా ఉండి.. వ్యయం పెరిగితే డిస్కంలు పనిచేయలేవని అందుకే పీపీఏలను పున: సమీక్షిస్తున్నామని జగన్ తెలిపారు. పీపీఏల వల్ల రాష్ట్రానికి లాభం లేకపోవడం వల్లే వాటిని రద్దు చేశామని సీఎం స్పష్టం చేశారు.
 
పొరుగు రాష్ట్రాలతో ఏపీకి సన్నిహిత సంబంధాలున్నాయని.. కేంద్రం అండదండలు కూడా రాష్ట్రానికి ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో వున్న అవకాశాలు వివరించేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేశామని.. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో మరో 4 ఓడరేవులు రానున్నాయని జగన్ పేర్కొన్నారు.
 
వ్యవసాయం, ఆక్వా రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తున్నామని.. మా ఆహ్వానికి అర్ధం.. స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలని, యువతకు ఏం అర్హతలు, నైపుణ్యం కావాలో చెబితే తీర్చిదిద్దుతామని జగన్ స్పష్టం చేశారు.