మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:07 IST)

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనపై యనమల ఫైర్

ఆంద్రలో వర్షాల కారణంగా రాష్ట్రంలో గ్రామాలు నీట మునిగితే.. సీఎం జగన్ మాత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లారంటూ మాజీ మంత్రి, శానస మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యన స్వప్రయోజం కోసమా..? రాష్ట్ర ప్రయోజనాల కోసమా..? అని ప్రశ్నించారు.
 
యనమల ప్రకటన యధావిధిగా..‘‘ప్రధానికి సమర్పించే వినతి పత్రం పబ్లిక్ డాక్యుమెంట్. ప్రజలకు, ప్రతిపక్షాలకు ఆ వినతిలో ఏం ఉందో తెలియాలి. అలాంటిది నిన్న ఢిల్లీలో ప్రధానికి అందించిన వినతి పత్రం కాపీని మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు..? డాక్యుమెంట్ తొక్కిపట్టి కేవలం ప్రెస్ నోట్‌ను విడుదల చేయడం ఏమిటి..?

మీరు అడిగిన దాంట్లో మీకు నచ్చిన అంశాలే ప్రజలకు చెబుతారా..? పబ్లిక్ డాక్యుమెంట్ రిక్విజిషన్ కాపీ ఎందుకు విడుదల చేయరు..? ప్రెస్ నోట్ మాత్రమే విడుదల చేయడం వెనుక మతలబు ఏమిటి..? మీరు అడిగిందే చెబుతారు కాని, దానిపై కేంద్రం స్పందన ఎందుకు వెల్లడించడం లేదు..? మీ సొంత మీడియాలో మాత్రం ఏదో సాధించినట్లు బాకా ఊదుకుంటారా..?
గత ప్రభుత్వ పాలనపై కేంద్రానికి ఇచ్చే వినతుల్లో ఎవరైనా, ఎప్పుడైనా గతంలో ప్రస్తావించారా, మాట్లాడారా..? మీ చేతగాని తనం బైటపడుతుందనే డాక్యుమెంట్‌ను తొక్కిపట్టారా..? ‘ఒకవైపు కెసీఆర్‌తో అంటకాగుతూ, మరోవైపు విభజన చట్టంలో హామీలు నెరవేర్చమని ప్రధానిని అడిగినట్లు చెప్పడం మొక్కుబడి కోసమా…? ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకా..?

నిజంగా రాష్ట్రాభివృద్ది కోరుకుంటే, ప్రజల సంక్షేమం ఆశిస్తే.. ఈ నాటకాలు ఆడతారా..? కేంద్రం ఇస్తేనే పోలవరంలో ఇటుక పెడతాను అనడాన్ని ఏవిధంగా చూడాలి..? టీడీపీ ప్రభుత్వం ముందే రాష్ట్ర నిధుల నుంచి ఖర్చుచేసి తరువాత కేంద్రం నుంచి నిధులు తెచ్చి 70% పనులు పూర్తి చేసింది. అలాంటిది ఇప్పుడు ఐదు నెలలుగా పోలవరం పనులు ఆగిపోయాయి. వాహనాల కదలికలతో, కూలీల సందడితో ఒకప్పుడు కోలాహలంగా ఉన్న పోలవరం సైట్.. ఇప్పుడు ఎలాంటి సందడి లేకుండా కనిపిస్తుంటే మీకు చీమ కుట్టినట్లు కూడా లేదా..?
 
‘రాజధాని నగరం అమరావతికి నిధులు అప్పటిదాకా అడిగేది లేదని చెప్పడం వెనుక అసలు ఆంతర్యం ఏమిటి..? మీ ఎంక్వైరీకి, కేంద్రం నిధులకు సంబంధం ఏమిటి..? అప్పటిదాకా పనులు నిలిచిపోతే నష్టం రాష్ట్రానికి కాదా, ప్రజలకు కాదా..? మీ అసమర్థతతో అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటారా..? ఏపీలో పరిశ్రమల స్థాపనకు రాయల్టీ ఇచ్చేది లేదని పరిశ్రమల శాఖ మంత్రే పార్లమెంటులో చెబితే ఇక మీరు సాధించింది ఏముంది..?

పరిశ్రమల స్థాపనకు రాయల్టీ ఇచ్చేది లేదన్న కేంద్ర మంత్రి సమాధానంపై మీ ఎంపీలు ఎందుకని నిలదీయలేదు..?
ప్రత్యేక హోదాపై ప్రధాని నుంచి ఒక్క మాట అయినా రాబట్టగలిగారా…? హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రులే చెబుతుంటే దానిపై మీరుగాని, మీ ఎంపీలుగాని ఎందుకు స్పందించరు..? దానిపై ప్రధాని స్పందన ఏమిటో ప్రజలకు ఎందుకని వివరించరు..?

రెవిన్యూ లోటు భర్తీకి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి..? లోటు భర్తీపై కేంద్రం నుంచి ఏం హామీ సాధించారు..?’’
‘తొలి ఏడాది ఆర్థికలోటు భర్తీ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎందుకని అడగలేదు..? గత ప్రభుత్వ అప్పుల గురించి ప్రస్తావించిన మీరు ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్టిన రూ.48వేల కోట్ల అప్పుల మాటేమిటి..? గత ప్రభుత్వం ఏడాదికి రూ.22వేల కోట్ల అప్పులు తెస్తే, మీరు ఏకంగా దానికి రెట్టింపు రూ.48వేల కోట్లు తెస్తామని బడ్జెట్‌లో చెప్పడం ద్వంద్వ వైఖరి కాదా..?

వాలంటీర్ల ముసుగులో మీ కార్యకర్తలకు రూ.2వేల కోట్లు దోచిపెట్టే పథకం వేశారు. పేదల తిండికి(అన్నా క్యాంటిన్లు) మోకాలు అడ్డుతున్నారు. మీ కార్యకర్తల పొట్ట నింపేందుకు పేదల పొట్ట కొడతారా..? కార్యకర్తల పొట్ట నింపేందుకు, నవరత్నాల ముసుగేసి కేంద్రాన్ని నిధులు అడుగుతారా..? కేంద్ర బడ్జెట్‌లో నవరత్నాలకు నిధులు ఏమైనా కేటాయించారా..?

మీ సొంత సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లారా..? రాష్ట్ర అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళ్లారా..? మూడుసార్లు మీ ఢిల్లీ పర్యటనల వల్ల సాధించింది ఏమిటి, రాష్ట్రానికి ఒరిగిందేమిటి..?’’ అంటూ సీఎం జగన్‌పై యనమల రామకృష్ణుడు ప్రశ్నల వర్షం కురిపించారు.