గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (17:51 IST)

పక్కా ప్లాన్‌తోనే దాడి చేశారు : ఈటల రాజేందర్

etala rajender
తన కాన్వాయ్‌పై పక్కా ప్లాన్‌తోనే దాడి చేశారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెరాస నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ సమక్షంలోనే తెరాస కార్యకర్తలు తన కాన్వాయ్‌పై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ దాడికి పోలీసులే నైతిక బాధ్యత వహించాలని ఆయన కోరారు. అదేసమయంలో మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస నేతల చెంపలు ఛెళ్లుమనిపించేలా ప్రజలు తీర్పునివ్వాలని ఈటల పిలుపునిచ్చారు. 
 
ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై తెరాస శ్రేణులు దాడికి పాల్పడ్డారు. దీనిపై ఈటల రాజేందర్ స్పందిస్తూ, పలివెలలో తెరాసకు క్యాడర్ కూడా లేదని ఇలాంటి చోట పోలీసులను కూడా లెక్క చేయకుండా వాళ్లు దాడులు చేయడాన్ని అందరూ గమనించాలని చెప్పారు. తమను ఎదుర్కోలేకే ఇలా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. 
 
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేసే సమయంలో కూడా ఇలాగే వ్యవహరించారని ఈటల మండిపడ్డారు. ఇలాంటి చిల్లర వేషాలు తెరాసకు కొత్తేమీ కాదని విమర్శించారు. పలివెలలో పక్కా ప్లాన్‌‍తోనే తన కాన్వాయ్‌పై దాడి చేశారన్నారు. తెరాస కార్యకర్తలు చేసిన దాడిలో 15 ప్రచార రథాలు, వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు.