శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే.. స్పీకర్‌ను ఆదేశించండి : హైకోర్టులో జగన్ పిటిషన్!!

Jagan
ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇపుడు అధికారమే కాదు ఏకంగా ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయారు. ఇపుడు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. దీన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తనకు ప్రతిపక్ష హోదా కల్పించేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్, స్పీకర్ కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ కార్యదర్శి లా అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ ముఖ్యకార్య దర్శి, స్పీకర్ కార్యదర్శితో పాటు వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. 
 
శాసనసభ సంప్రదాయం ప్రకారం అధికార పార్టీ శాసనసభా పక్షనేత ప్రమాణం పూర్తి అయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభాపక్ష నేతతో ప్రమాణం చేయించాలని పిటి‌షన్‌లో పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా అధికార పార్టీ శాసనసభా పక్షనేత తర్వాత మంత్రుల చేత ప్రమాణం చేయించారని, వారి తర్వాత తనకు ప్రమాణం చేసే అవకాశం ఇచ్చారన్నారు. ఇది గమనించిన తర్వాత వైసీపీఎల్పీకి ప్రధాన ప్రతిపక్షపార్టీ హోదా, తనకు ప్రతిపక్షనేత హోదాను ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లు అర్థమైందన్నారు. 
 
'టీడీపీ-జనసేన-బీజేపీ' పార్టీలు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయడమేకాకుండా, మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. వైసీపీ మాత్రమే ప్రతిపక్ష పార్టీగా ఉందని చెప్పేందుకు ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తకుండా చేసేందుకే వైసీపీఎల్పీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని శాసనసభలో తనకు ప్రతిపక్షనేత హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వండి' అని పిటిషన్‌లో పేర్కొన్నారు.