ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (09:02 IST)

ఉన్నపరువు పోతుందని ఎమ్మెల్సీ ఎన్నికలకు వైకాపా దూరం!!

ysrcpjagan
అధికారంలో ఉన్న సమయంలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. ఈ మూడు స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా ఘోర పరాజయాన్ని చవిచూసింది. 151 అసెంబ్లీ సీట్లతో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైకాపా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అలాగే, 21 ఎంపీ సీట్ల నుంచి మూడు ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ క్రమలో త్వరలో కృష్ణా - గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నిక నోటిఫికేషన్ వెలువడకముందే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైకాపా అధికారికంగా ప్రకటించింది.

అయితే, ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా మతలబు దాగివుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు లేదు కదా, ఇప్పటికే తామే అధికారంలో ఉన్నట్టుగా ఫీలైపోతున్నారు. పైగా, రాష్ట్రంలో పరిస్థితులు తమకు ఏమాత్రం అనుకూలంగా మారలేదు. ఇలాంటి పరిస్థిల్లో పోటీ చేసి ఓడిపోతే ఉన్న పరువు కూడా పోతుందని భావించారు. అందుకే ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. 
 
కానీ, ఈ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నట్టు వైకాపా నేతలు చెప్పారు. పైపెచ్చు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని, ఆటవిక పాలన సాగుతుందని, తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి ఆరోపణలు చేసి, ఎన్నికలను బహిష్కరించడం వల్ల ఓ వైపు పరువు దక్కించుకోవడంతో పాటు మరోవైపు తమ ప్రత్యర్థి అయిన అధికార టీడీపీని దెబ్బకొట్టవచ్చనే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. గతేడాది ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న వైకాపా.. ఆ మూడు స్థానాలను గెలుచుకోవాలని అన్ని ప్రయత్నాలూ చేసింది. ఓటర్ల నమోదులో ఎప్పుడూ వినని, చూడని అక్రమాలకు పాల్పడింది. అయినా మూడు చోట్లా వైకాపా మద్దతుదారులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. 
 
'పార్టీ అధికారంలో ఉండి, అధికార దుర్వినియోగానికి పాల్పడి, అరాచకాలు చేసి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గలేకపోయాం. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ ప్రజలు దారుణంగా తిరస్కరించారు. ఆ ఘోర పరాభవాన్ని మరచిపోలేదు. ఈ నాలుగైదు నెలల్లో పరిస్థితులు మనకు సానుకూలంగా మారిన దాఖలాల్లేవు. కాబట్టి ఇప్పుడు పోటీ చేసినా, సాధించేదేమీ ఉండదు. మొన్నటి ఫలితమే పునరావృతమైతే మరింత పతనమవుతాం. పోటీ నుంచి తప్పుకొంటే కనీసం పరువైనా దక్కుతుంది. మరోవైపు అరాచకాలు చేస్తున్నారంటూ టీడీపీపై నిందలూ మోపవచ్చు. పైగా టీడీపీకి మరింత బలంగా పోటీనిచ్చేలా పీడీఎఫ్‌నకు పరోక్షంగా దోహదపడొచ్చు. తద్వారా తెదేపాను దెబ్బకొట్టొచ్చు' అనే యోచనతోనే ఎన్నికలను బహిష్కరించిందన్న రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.