శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:23 IST)

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైకాప నేత ప్రదర్శన - ప్రాణాలు కాపాడాలంటూ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా పాలనలో విపక్ష నేతలకే కాదు చివరకు వైకాపా నేతల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని నిరూపితమైంది. వైకాపాకు చెందిన గుప్తా సుబ్బారావు తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన చేశారు. చేతిలో ప్లకార్డులను ధరించి ఆయన ఈ ప్రదర్శన చేశారు. 
 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారూ.. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, వారిని కాపాడాలని ఆయన కోరారు. అంతేకాకుండా తనపై దాడి చేసినవారిని, అందుకు పురికొల్పిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేసమయంలో తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆయన ప్రాధేయపడుతున్నాడు. 
 
గత యేడాది డిసెంబరు 12వ తేదీన వైకాపా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న గుప్తా సుబ్బారావు మాట్లాడుతూ, మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరివల్ల పార్టీకి నష్టం కలుగుతుందని వారు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలు వైకాపా నేతలకు ఆగ్రహం తెప్పించాయి. బాలినేని అనుచరులుగా చెబుతున్నవారు కొందరు గుప్తా సుబ్బారావుపై దాడి చేశారు. ఆ తర్వాత గుంటూరులో ఓ లాడ్జిలో ఉన్న గుప్తాపై దాడి చేసి క్షమాపణలు చెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ, గుప్తా సుబ్బారావు ఉన్నట్టుండి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్లకార్డులు చేతపట్టుకుని ప్రదర్శన చేయడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.