శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (09:11 IST)

జగన్‌కు వైసీపీ ఎమ్మెల్యే షాక్!

3 రాజధానుల ప్రకటనపై జగన్ కు సొంత పార్టీ ఎమ్మెల్యే షాకిచ్చారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో 3 రాజధానులు ఉండొచ్చేమోనని సీఎం జగన్ చేసిన ప్రకటనను అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్రంగా తప్పుపట్టారు.

మూడు రాజధానులపై జగన్ వ్యాఖ్యలను నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. అసెంబ్లీ, పరిపాలన విభాగం ఒకే చోట ఉండాలని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండూ కూడా ఒక్కచోటే ఉండాలని ఆకాంక్షించారు.

‘ఇది నా అభిమతం.. నా ఆలోచన మాత్రమే’నని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని సీఎం జగన్‌కు కూడా తెలియజేస్తానని వెల్లడించారు. విశాఖను ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేయాలన్నారు. కానీ ఇప్పటికే హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోసారి ప్రజలు నష్టపోవడం భావ్యం కాదని వాపోయారు. నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం సరైన నిర్ణయమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అప్పటివరకూ ప్రజలు అపోహలు పడవొద్దని సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన వ్యాఖ్యలురాజకీయంగా సర్వత్రా ఆసక్తి రేపుతోంది.