ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 ఏప్రియల్ 2024 (15:33 IST)

ఔను.. ఆమె మా మేనత్తే, కాకపోతే గతించినవి ఆమెకి గుర్తులేదు, ఎండాకాలం కదా: వైఎస్ షర్మిల - video

sharmila
వైఎస్ కుటుంబం పరువును ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బజారుకీడుస్తున్నారంటూ వైఎస్ వివేకా సోదరి విమలమ్మ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఔను... ఆమె మా మేనత్తే. వారికి జగన్ గారు ఆర్థికంగా చాలా సాయం చేసారు. అందుకే అవన్నీ ఆమెకి బాగా గుర్తున్నాయి. కానీ ఆమె సోదరుడుని గొడ్డలితో హత్య చేసిన నిందితుల గురించి మాత్రం మర్చిపోయారు. సీబీఐ తన చార్జిషీటులో ఏం చెప్పిందో దాన్నే తాము అడుగుతున్నాము. మేమేమీ సృష్టించి మాట్లాడటంలేదు. ఐనా ఆమె వయసులో పెద్దవారు. మర్చిపోవడం సహజమే. పైగా ఎండాకాలం కదా అని అన్నారు షర్మిల.
 
మరోవైపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకత్వానికి వైఎస్‌ షర్మిల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా కడప నియోజకవర్గం పరిధిలోని వీధుల్లో ఆమె ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య అంశంపై ఆమె పదేపదే జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను టార్గెట్ చేస్తున్నారు.
 
ఈ విషయంపై మాట్లాడిన షర్మిల.. వివేకానందరెడ్డి హత్య అంశంపై తీర్పు చెప్పాలని కడప ఓటర్లను అభ్యర్థిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. హత్యకేసులో న్యాయమైన తీర్పు కోసం పోరాడుతున్న తనకు మీ మద్దతు కావాలని అభ్యర్థిస్తున్నారు. హంతకులను మద్దతివ్వవద్దని కడప ఓటర్లను ఆమె భావోద్వేగంతో వేడుకున్నారు. ఆమె తన చీర కొంగు చాచి అడుగుతున్నాను. తనకు న్యాయం చేయండి అని ఓటర్లను వేడుకున్నారు. 
 
ఓటర్లకు షర్మిల ఉద్వేగభరితంగా అభ్యర్ధించిన మరుసటి రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెల్లెలు, షర్మిల మేనత్త వైఎస్ విమలమ్మ షర్మిలపై విరుచుకుపడ్డారు. షర్మిల, సునీత తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ వివేకానందరెడ్డిని అసలు హంతకులతో జతకట్టి జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. షర్మిల, సునీతలను వైఎస్ కుటుంబంలో కానీ, సామాన్య ప్రజల్లో కానీ పట్టించుకునే వారు లేరని, ఈ డ్రామాలు ఆపాలని, వెంటనే ప్రజలు వారి నోరు మూయించాలని ఆమె కోరారు.
 
వైఎస్ కుటుంబానికి చెందిన బద్ధ శత్రువులు షర్మిల చుట్టూ చేరారనీ, వాళ్ల మాటలకు షర్మిల ఆడుతోందని విమలమ్మ తీవ్రంగా విమర్శించారు. ఇక నుంచి షర్మిల, సునీతలకు వెన్నుదన్నుగా నిలిచే ఉద్దేశం వైఎస్‌ కుటుంబంలో ఎవరికీ లేదని ఆమె పేర్కొన్నారు.