సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (18:39 IST)

చంద్రబాబు ఇంటి పేరును 'నారా' బదులుగా 'సారా' పెట్టుకోవాలి : సీఎం జగన్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మృతులతో పాటు రాష్ట్రంలో ఏరులై పారుతున్న జే బ్రాండ్ మద్యం విక్రయాలపై ప్రధాన ప్రతిక్షమైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. 
 
ఈ చర్చకు స్పీకర్ అనుమతించలేదు. దీంతో తెదేపా సభ్యులు సభలో చిడతలు వాయిస్తూ రభస సృష్టించడంతో వారిని సస్పెండ్ చేశారు. దీనిపై సీఎం జగన్ సభలో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లకు అనుమతి ఇచ్చారని చెప్పారు. ఈ బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలేనని, 2019 తర్వాత ఏపీలో కొత్తగా ఒక్క బ్రాండుకు కూడా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. 
 
మద్యం బ్రాండ్లలో స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్ వంటి బ్రాండ్లు ఉన్నట్టు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 16 వైద్య కాలేజీలకు అనుమతులు ఇస్తే గత చంద్రబాబు ప్రభుత్వం 14 డిస్టిలరీ కంపెనీలకు అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. అందువల్ల చంద్రబాబు నాయుడు తన ఇంటిపేరును నారా బదులు సారా అని పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో ఒక్కరు కూడా కల్తీ సారాతో చనిపోలేదని, టీడీపీ నేతలు చెప్పేవన్ని అసత్యాలేనని చెప్పారు.